చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ, ప్రముఖ టెక్ దిగ్గజం బెంగళూరులోని ఇంటెల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరిందని ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను ఇంటెల్ ఇండియా కంపెనీ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ రీజియన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సలోని సింఘాల్‌కు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఏఐ) నైపుణ్యాలను అందించడం ఈ అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు. ఫ్యాకల్టీ, ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులకు కో–బ్రాండెడ్ సర్టిఫికెట్లు అందించడం, ఉపాధి అవకాశాలపై మార్గదర్శకత కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇంటెల్ ఇండియా ఆసియా పసిఫిక్–జపాన్ రీజియన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సలోని సింఘాల్ మాట్లాడుతూ, విజ్ఞాన్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని, డిజిటల్ యుగానికి అనుగుణంగా విద్యార్థులను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వైపు దారితీస్తూ, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను అందించి వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇంటెల్ ఇండియా రూపొందించిన కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన 601 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ‘ఏఐ స్మార్ట్ క్యాంపస్ హ్యాకథాన్’లో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇంటెల్ ఇండియా నేషనల్ ఆపరేషన్స్ మేనేజర్ విక్రమ్ పర్మార్, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


