పాఠశాలకు పంగనామాలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలకు పంగనామాలు

Apr 24 2026 10:40 AM | Updated on Apr 24 2026 10:40 AM

విద్యా సంవత్సరం చివరి పనిదినం నాడు సైతం గైర్హాజరు సెలవులో ఉన్నా లీప్‌ యాప్‌లో హాజరు నమోదు చేస్తున్నట్టు గుర్తింపు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిన పాఠశాలలో ఇద్దరిపైనే భారం

ఆర్నెల్లుగా బడి ముఖం చూడని ఉపాధ్యాయుడు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆర్నెల్లుగా పాఠశాల ముఖం చూడని ఉపాధ్యాయుడు లీప్‌ యాప్‌లో నిత్యం హాజరు నమోదు చేసుకుంటున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో దీర్ఘకాలిక సెలవులో ఉండి, మరోవైపు విధుల్లో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపుతున్న వైనం వెలుగు చూసింది. గుంటూరు శివారు గోరంట్లలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల (ఎల్‌ఈ)లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడు గతేడాది నవంబర్‌ నుంచి పాఠశాలకు రావడం లేదు. వ్యక్తిగత వ్యవహారాలతో పాఠశాలకు రాలేని పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారికంగా సెలవు పెట్టుకోవాల్సి ఉంది. అయితే అధికారికంగా సెలవు పెట్టకుండా, సంబంధిత పాఠశాల హెచ్‌ఎంకు వాట్సాప్‌ ద్వారా సెలవు సమాచారాన్ని పంపుతున్నట్లు తెలిసింది. లీప్‌ యాప్‌లో పాఠశాల సమీపంలోనే ఉండి హాజరు నమోదు చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇది సీసీఈ నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు.

ఐదు తరగతులకు ఇద్దరే టీచర్లు...

పాఠశాలలో 62 మంది విద్యార్థులు చదువుతుండగా, ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయగా, మిగిలిన ముగ్గురిలో ఒకరు ఆర్నెల్లుగా గైర్హాజరు కావడంతో ఉన్న ఇద్దరు టీచర్లే ఐదు తరగతులను బోధిస్తున్నారు. దీంతో వారిపై అధిక పని భారం పడి సతమతమవుతున్నారు. నిత్యం పాఠశాల విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులతో పాటు డిప్యూటేషన్‌పై వెళ్లిన, దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఉపాధ్యాయులు సైతం విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున పాఠశాలకు ఖచ్చితంగా హాజరు కావాలని విద్యాశాఖ నిబంధనలు చెబుతుండగా, సంబంధిత ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కాలేదు. పాఠశాలకు రాకుండా, అధికారికంగా సెలవు పెట్టకుండా యాప్‌లో హాజరు నమోదు చేస్తున్న సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషాను వివరణ కోరగా, ఉపాధ్యాయుడి వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement