కాలువపై నుంచి వేసిన పైపులైన్లు తొలగింపు నగరపాలక సంస్థ పైపులైన్ నుంచి నీళ్లు తీసుకుంటున్నట్లు నిర్ధారించిన ఇరిగేషన్ శాఖ
తాడేపల్లిరూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని గుంటూరు చానల్ నుంచి ‘నీటి వ్యాపారం సాగుతోందిలా’ శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఇరిగేషన్ శాఖ గుంటూరు చానల్ జేఈ అవినాష్ పరిశీలించి కాలువపై నుంచి వేసిన పైపులైన్లు తొలగించారు. గుంటూరు చానల్ నుంచి నీటిని తీసుకోవడం లేదని నిర్ధారించారు. ఎత్తిపోతల గ్రావిటీ కాలువ ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి నగరపాలక సంస్థకు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఆ పైపులైన్లు అక్కడక్కడా ఓపెన్‌గా ఉండడంతో విద్యుత్ మోటారును ఏర్పాటు చేసి నీటిని గుంటూరు చానల్ దాటించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వైపు పాత జాతీయ రహదారి వెంబడి ఉన్న పలు నిర్మాణాలు, కంపెనీలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. గుంటూరు నగరపాలక సంస్థ నుంచి నీటిని చోరీ చేస్తున్న విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకునే విధంగా చూస్తామని అవినాష్ తెలిపారు.


