పాస్‌ పుస్తకాల జారీకి వేగవంతమైన చర్యలు | - | Sakshi
Sakshi News home page

పాస్‌ పుస్తకాల జారీకి వేగవంతమైన చర్యలు

Apr 24 2026 10:40 AM | Updated on Apr 24 2026 10:40 AM

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: సర్వే పూర్తయిన రెండు గ్రామాల్లో పట్టాదార్‌ పాసుపుస్తకాల జారీకి సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్‌ఏ గురువారం జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసి, ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె.ఖాజావలి, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ వెంకట రత్నం, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్‌ కె.కళ్యాణ చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు.

విజయ పతాకం ఎగురవేయాలి..

పారా సిట్టింగ్‌ క్రికెట్‌లో గుంటూరు జిల్లా నుంచి టీమ్‌ జాతీయ జట్టుకు ఎంపికై న కంఠ ఈశ్వరరావు, షేక్‌ నాగూర్‌ వల్లి, బండపల్లి మహేష్‌, బండారు దుర్గారావులను జిల్లా కలెక్టర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ గురువారం స్థానిక కలెక్టరేట్‌లో అభినందించారు. టీమ్‌ ఇండియాకు ఎంపికై న అభ్యర్థులు గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ కు మర్యాదపూర్వకంగా కలిసారు. విజయ పతాకతో తిరిగిరావాలని జిల్లా కలెక్టర్‌ ఆకాక్షించారు.

కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి ..

కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్‌ సాయి కాంత్‌ వర్మ కొనియాడారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్‌ఓ ఎన్‌.ఎస్‌.కె.ఖాజావలి బి.సి సంఘాల నాయకులతో కలిసి భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, బీసీ సంఘాల నాయకులు వేములకొండ శ్రీనివాస్‌, జంపని నాగేశ్వర రావు, షేక్‌ షూకుర్‌, రాజకొండ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం కావాలి...

అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం వీడియో సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అన్ని శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. రహదారులు, గృహ నిర్మాణం వంటి పనులు ప్రజలకు ఎంతో అవసరమని వాటి పట్ల దృష్టి సారించి త్వరితగతిన పూర్తి అయ్యేటట్లుగా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో మంజూరైన రహదారులు వాటి పరిస్థితుల వివరాలను పరిశీలించి తక్షణం పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉన్న వాటిని అతివేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో రహదారులు భవనాల శాఖ అధికారులు, జల వనరుల శాఖ అధికారులు, విద్యుత్తు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement