బెట్టింగ్‌కు బానిసైన విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌కు బానిసైన విద్యార్థి

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

బ్యాంకు ఖాతా నుంచి రూ.3 లక్షలు కాజేసిన బాలుడు మళ్లీ రూ.లక్ష కోసం యత్నించడంతో ఖాతాను బ్లాక్‌ చేయించిన తల్లి సెల్‌ఫోన్‌తో పారిపోవడంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

మాచర్ల క్రికెట్‌ బెట్టింగ్‌ భూతం చిన్న పిల్లలను వదలడం లేదు. పట్టణంలో చాలా రోజులుగా బెట్టింగ్‌ బాబులు హల్‌చల్‌ చేస్తున్నారు. కొందరు దీనికి బలైపోతున్నారు. కొందరు అప్పుల పాలవుతున్నారు. తాజాగా పట్టణంలో ఓ కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివే బాలుడు బెట్టింగ్‌కు బానిసయ్యాడు. గుంటూరులో చదువుకుంటూ వ్యసనపరుడుగా మారాడు. అప్పుల పాలై డబ్బులెలా చెల్లించాలో తెలియక చివరికి తన తల్లి బ్యాంకు ఖాతాకు ఎసరుపెట్టాడు. పాస్‌ బుక్‌, ఏటీఎం కార్డు తీసుకెళ్లి రూ. 3 లక్షలు డ్రా చేసి అప్పులు కట్టాడు. అంతటితో ఊరుకోలేదు. మళ్లీ బెట్టింగ్‌ ఆడాడు. గమనించిన తల్లి తన పెద్ద కుమారుడితో వెళ్లి బ్యాంకు ఖాతా పరిశీలించగా విషయం తేలింది. కుమారుడిని మందలించి, గుంటూరులో ఉంటున్న ఆమె మాచర్లకు తిరిగొచ్చి ఇక్కడే ఉంటోంది. తాజాగా రెండు రోజుల కిందట తన తల్లి ఖాతాలో మరో రూ. లక్ష ఉన్నాయని తెలుసుకున్న చిన్న కుమారుడు... డ్రా చేయటానికి ఆమె సెల్‌ఫోన్‌ తీసుకెళ్లాడు. ఈలోపు తన ఖాతాను ఆమె బ్లాక్‌ చేయించింది. అనంతరం ఆ మైనర్‌ సెల్‌ఫోన్‌ తీసుకొని ఉడాయించాడు. దీనిపై తల్లి మంగళవారం రాత్రి పట్టణ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. బాలుడు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement