సకాలంలో ఇవ్వాలని కోరుతున్న ఏఎన్‌యూ ఉద్యోగులు, పెన్షనర్‌లు
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో వేతనాల కోసం ఉద్యోగులు, పెన్షనర్‌లు ఎదురు చూస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సకాలంలో వేతనాలు అందడం లేదని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వర్సిటీలో పలువురు ఉద్యోగులు ఏ నెలకు ఆ నెల ఎప్పుడు వేతనాలు అకౌంట్‌కు జమ అవుతాయా అని ఎదురు చూడాల్సి వస్తోందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెల 21వ తేదీ వచ్చినా ఇప్పటి వరకూ నాన్‌టీచింగ్, టీచింగ్ ఉద్యోగులకు వేతనాలు చేతికి అందలేదు. వర్సిటీలో పనిచేస్తున్న డైలీవైజ్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల గెస్ట్ ఫ్యాకల్టీకి మాత్రమే ఈ నెల వేతనాలు అందాయి. నెలలో మొదటి వారంలో అందాల్సిన వేతనాలు మూడు వారాలు గడుస్తున్నా అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. పెన్షనర్‌ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉద్యోగ విరమణ పొందిన తరువాత నెల నెలా వచ్చే పెన్షన్‌పైనే ఆధారపడి జీవితం గడుపుతూ ఉంటారు. ఏప్రిల్ నెల 21వ తేదీ వచ్చినా ఇప్పటి వరకూ వేతనాలు చేతికి రాకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని పలువురు పెన్షనర్‌లు ప్రశ్నిస్తున్నారు. ఏఎన్‌యూలో పెన్షనర్‌లు సుమారు 600 మంది ఉండగా, వారికి ప్రతి నెలా రు. 5 కోట్లకు పైగా అందాల్సి ఉంది. సకాలంలో రాక వందల సంఖ్యలో పెన్షనర్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి, పెన్షనర్‌లకూ వేతనాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు.


