తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ సూచన
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): వేసవి సెలవుల్లో విద్యార్థులు, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభం దృష్ట్యా విద్యార్థులు, చిన్న పిల్లలను అనుక్షణం తల్లిదండ్రులు గమనించాలని కోరారు. సెలవుల్లో సరదా కోసం వారు కృషా్‌ణ్ నది లోపలకు, ప్రమాదకరమైన జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. పిల్లలు సరదాగా ఈత కొట్టేందుకు లేదా స్నానాల కోసం సమీపంలోని చెరువులు, బావులు, కాల్వలు, కృష్ణానది, నీటి కుంటల వద్దకు వెళ్లే అవకాశం ఉందన్నారు. నీటి ప్రమాదాలతో కలిగే నష్టాలు, గతంలో జరిగిన విషాద సంఘటనలను పిల్లలకు తెలియజేసి, వారిలో అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. ఆటపాటలు, కథల పుస్తకాలు చదవడం లేదా వేసవి శిక్షణ శిబిరాలకు వారిని పంపించాలన్నారు. జిల్లాలోని కృష్ణానది తీర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు నది ఉధృతిని స్థానికులు తెలియజేయాలన్నారు. హెచ్చరిక బోర్డులున్న ప్రదేశాల్లోని నీటిలోకి దిగవద్దని అన్నారు. అత్యవసర పరిస్థితులలో డయల్ 100, 112 లేదా స్థానిక పోలీస్ స్టేషనులో సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.


