పోరాడుదాం.. నారీశక్తిని చాటుదాం | - | Sakshi
Sakshi News home page

పోరాడుదాం.. నారీశక్తిని చాటుదాం

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

పోరాడుదాం.. నారీశక్తిని చాటుదాం

నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు మోసాన్ని ఎండగడదాం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి పెడనలో ఐదు జిల్లాల మహిళా నేతల ఆత్మీయ సమావేశం

పెడన: సమస్యలపై ప్రజాపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించడానికి వైఎస్సార్‌ సీపీలోని ప్రతి మహిళా కూడా ఒక ఆదిపరాశక్తిగా మారాలని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణాజిల్లా పెడనలో ఐదు జిల్లాల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన వైఎస్సార్‌ సీపీ మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, ఆయా విభాగాలకు చెందిన మహిళా నాయకులు తొలుత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం..

సభను ఉద్దేశించి వరుదు కల్యాణి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అందరి ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకుని, రానున్న కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేద్దామన్నారు. జగనన్న మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఎంత చక్కటి పరిపాలన అందించారో స్వయంగా చూశామన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళల పేరు మీద ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచాకాలపై ఒక చిరుతపులిలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి..

మహిళలపై చంద్రబాబుకు చిన్నచూపని, అందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణియేనని వరుదు కల్యాణి దుయ్యబట్టారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టీడీపీ ఎంపీలు విందులు, వినోదాల్లో పాల్గొనడం గమనిస్తే మహిళా బిల్లును వ్యతిరేకించారనే విషయం తేటతెల్లమవుతుందన్నారు.

మావిగన్‌ ప్రతిపాదన అద్భుతం..

మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాలను అనుసంధానిస్తూ పోర్టు, విమానాశ్రయం, పరిశ్రమలున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మావిగన్‌ను రాజధానిగా చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదన బ్రహ్మాండంగా ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని వరుదు కల్యాణి అన్నారు. అమరావతి వెనుక అవినీతి నెలకొందనే విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు డైవర్షన్‌ పొలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు.

సమావేశంలో కృష్ణాజిల్లా మహిళా అధ్యక్షురాలు, మాజీ డెప్యూటీ మేయర్‌ శీలం భారతి, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ పేరం త్రివేణిరెడ్డి, స్టేట్‌ మహిళా విభాగం సమాచార విభాగం అధ్యక్షురాలు సంపత్తి విజిత, మహిళా విభాగం జాయింట్‌ సెక్రటరీ కందుకూరి జ్యోతి, జాయింట్‌ సెక్రటరీ మునుపురి హరీష్య, గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు అశ్వినిరెడ్డి, గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్‌ రాణి, చీరాల నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మద్దులూరి సీతామాలక్ష్మి, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్‌ పి.గీతా హాసంతి, పెడన నియోజకవర్గ నాయకురాలు మైలా రత్నకుమారి, రాజులపాటి వాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement