తులసి ధర్మచరణ్
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్) : అంతర్జాతీయ క్రీడ బాక్సింగ్‌ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గుంటూరు జిల్లా బాక్సింగ్ ప్రెసిడెంట్ తులసి ధర్మ చరణ్ పేర్కొన్నారు. బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొసనా వేణుగోపాలరావు మెమోరియల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యక్రమంలో తులసి ధర్మచరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డీఎస్‌డీఓ అఫ్రోజ్ ఖాన్ కార్యక్రమానికి అతిథిగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ, కార్యదర్శి డాక్టర్ చిరంజీవి అధ్యక్షత వహించారు. తులసి ధర్మచరణ్ మాట్లాడుతూ కఠోర సాధన తోనే బాక్సింగ్ క్రీడలో విజయాలు సాధ్యమవుతాయన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంతో రాష్ట్రానికి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులు తయారవుతారన్నారు. ఈ సందర్భంగా బాక్సింగ్ విజేతలకు తులసి ధర్మ చరణ్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ ఆర్.విశ్వనాథం, గంధం వెంకటేశ్వరరావు, వాకా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్ : ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోకి చొరబడిన దుండగులు బీరువాను ధ్వంసం చేశారు. నగదు, విలువైన వస్తువులు లభ్యం కాకపోవటంతో వెనుతిరిగారు. ప్రకాష్‌నగర్‌లో బుధవారం వెలుగు చూసిన చోరీ యత్నం సంఘటనకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాష్‌నగర్ జిల్లా రిజిస్టార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యలవర్తి రాంప్రసాద్ కుటుంబ సభ్యులతో మూడు రోజుల క్రితం షిరిడి యాత్రకు వెళ్తూ ఇంటికి తాళాలు వేసి వెళ్లాడు. బుధవారం ఉదయం ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు తెలియజేశారు. సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి కింద, పై అంతస్తులోని రెండు తలుపుల తాళాలను పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బీరువాను ధ్వంసం చేసి, అందులోని సామాన్లను చిందరవందరుగా పడేసి ఉండటాన్ని గమనించారు. షిరిడి యాత్రలో ఉన్న ఇంటి యజమానితో సీఐ మాట్లాడారు. ఇంట్లో విలువైన వస్తులు, నగదు ఏమీ లేవని చెప్పటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలను సేకరించారు. గృహ సమీపంలోని సీసీ పుటేజ్‌లను పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు.


