తెనాలిరూరల్: రైలు కింద పడి తెనాలిలోని పినపాడు రైల్వే గేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పట్టణ ముత్తెంశెట్టిపాలెం మల్లాది వారి వీధికి చెందిన కోటపాటి కళ్యాణ్ చక్రవర్తి(53) వందే భారత్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వినుకొండ: కోర్టు వారెంట్‌ను అమలు చేసేందుకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం, ఆవులమంద గ్రామానికి చెందిన పిడతల అనూషకు, పిడతల పూల రంగయ్యతో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా, ప్రస్తుతం వినుకొండలోని శాలివాహన నగర్‌లో నివాసం ఉంటున్న అనూష స్థానిక కోర్టులో భర్తపై భరణం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడైన పూల రంగయ్య కోర్టుకు హాజరుకాకపోవడంతో, వినుకొండ కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న పూల రంగయ్యపై వారెంట్‌ను అమలు చేసేందుకు వినుకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు సుబ్బారావు, సత్యరావు హైద రాబాద్ వెళ్లారు. అక్కడ పూల రంగయ్య పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రవర్తించా రు. ప్రభుత్వ విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకు గాను హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ ఎస్‌హెచ్‌ఓ బి.ప్రభాకర్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు పూల రంగయ్యను అరెస్ట్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
సత్తెనపల్లి: భార్య పుట్టింటికి వెళ్ళిందని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి వెలుగు చూసింది. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన మన్నేటి గోపీకృష్ణ, భార్య ఆదిలక్ష్మి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇరువురు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆదిలక్ష్మి అచ్చంపేట మండలం చెరుకుంపాలెంలోని పుట్టింటికి వెళ్లడంతో గోపికృష్ణ యాసిడ్ ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


