● వాల్‌పోస్టర్లు ఆవిష్కరించిన
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
అంబటి మురళీకృష్ణ
● జొన్న, మొక్కజొన్నకు మద్దతు
ధర చెల్లించాలని డిమాండ్
పెదకాకాని: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో గురువారం ‘పొన్నూరు రైతు పోరాట దీక్ష’ నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రమైన పెదకాకానిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం రైతులతో కలిసి ఆయన వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. జొన్న, మొక్కజొన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా 70 వేల ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న సాగు చేయగా, ఒక్క పొన్నూరు నియోజకవర్గంలోనే 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న పండించారన్నారు. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర ప్రకటిస్తే ఈ టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదన్నారు. రైతులు చేసిన అప్పులు చెల్లించేందుకు, నిల్వ చేసుకునే స్థలం లేక క్వింటా రూ.1400 నుంచి రూ.1700లకు అమ్ముకుని నష్టపోతున్నారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అనుచరులు దళారుల అవతారమెత్తి రైతులను మోసం చేస్తూ పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొక్కజొన్నను ఎమ్మెల్యే తన సంగం డెయిరీలో నిల్వ చేసి పశువులకు దాణాగా మార్చడం, మారు బేరానికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం గుంటూరులో నిర్వహిస్తున్న రైతు పోరాట దీక్షకు పొన్నూరు నియోజకవర్గంలోని రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.


