జొన్న, మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆందోళనకరం పొన్నూరులోనే 40వేల ఎకరాల్లో సాగు దళారులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమవుతున్న అధికారులు రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు
గుంటూరు వెస్ట్: రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం అన్ని విధాలుగానూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు వేడుక చూస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ దుయ్యబట్టారు. పొన్నూరు నియోజకవర్గ రైతులతో కలిసి ఆయన సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతిపత్రం అందజేసి, జిల్లాలోని రైతుల కష్టాలను వివరించారు. అనంతరం మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రబీ సీజన్లో పండించిన మొక్క జొన్న, జొన్న పంటలకు మద్దతు ధర లభించక రైతులు నైరాశ్యంలో మునిగిపోయారన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ పంటలను 70 వేల ఎకరాల్లో సాగు చేస్తే ఒక్క పొన్నూరు నియోజకవర్గంలోనే 40 వేల ఎకరాలు సాగుచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు మొక్కజొన్నకు క్వింటాకు మద్దతు ధర రూ.2,400, జొన్నకు క్వింటాకు రూ.3,700 రైతులకు అందడంలేదన్నారు. దళారుల చేతిలో దారుణంగా మోసపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దళారులు మొక్కజొన్న క్వింటాకు రూ.1700, జొన్న రూ.1900 మాత్రమే కొంటూ రైతుల కష్టాలను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
రూ.కోట్లలో నష్టపోతున్న రైతులు
మురళీకృష్ణ మాట్లాడుతూ పొన్నూరు నియోజవకర్గంలో మొక్కజొన్న దిగుబడి సుమారు 18 లక్షల క్వింటాళ్లు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం రైతులకు సుమారు రూ.432 కోట్లు రావాల్సి ఉందన్నారు. అయితే దళారులు తక్కువ ధరకు కొనడం ద్వారా సుమారు రూ.130 కోట్ల మేర నష్టపోతున్నారన్నారు. ఇంత దారుణం జరుగుతుంటే, రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా రైతాంగం తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామ, మండలాల వారీగా మార్కెఫెడ్, మార్కెట్ యార్డ్‌ల ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి రైతులకు మనోధైర్యం ఇవ్వాలన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భాను కిరణ్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పెనుమాల అరుణ్ కుమార్, పెదకాకాని జడ్పీటీసీ సభ్యులు గోళ్ళ జ్యోతి, కాకాని మండల మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు చాగంటి మురళీ కుమార్ రెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి రాఘవ, రైతు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి
మంగళగిరి టౌన్: చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతుల కష్టాలు ఆలకించి వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని దుర్గాప్రసాద్‌లు డిమాండ్ చేశారు. మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులకు నాయకులు, కార్యకర్తలతో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జొన్న, మొక్కజొన్నకు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.2,400 మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నకు ధర లేక దళారులకు క్వింటా రూ.1,700లకే అమ్ముకునే స్థితికి రైతును ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర, మంగళగిరి, తాడేపల్లి మండలాల అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, అమరా నాగయ్య, జిల్లా అధికార ప్రతినిధి బాజీ గంగాధరరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు మేకల సాంబశివరావు, శివనాగేంద్ర, పార్టీ రైతు విభాగాల అధ్యక్షులు రుక్మాంగరెడ్డి, తమ్మా సాంబిరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


