జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత పట్ల జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్‌లతో కలిసి సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి శాఖలో నోడల్ అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల, జిల్లా కార్యాలయాల్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జనకూడలి ప్రదేశాల్లోనూ, ఇతర అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
తాగునీటి ఎద్దడి తలెత్తరాదు
తాగునీటి ఎద్దడి ఏ గ్రామంలోనూ తలెత్తకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడే గ్రామాలు గుర్తించాలని, అటువంటి గ్రామాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బోర్లను 24 గంటలలో మరమ్మతులు పూర్తి చేసేందుకు అవసరమైన విడి పరికరాలు సిద్ధంగా పెట్టాలన్నారు. పశువులకు, వీధి కుక్కలకు కూడా తాగునీటిని అందుబాటు ఉంచాలని సూచించారు. తాగునీటి నాణ్యత పరీక్షలు ప్రతి రోజూ చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వడ దెబ్బపై ప్రజల్లో అవగాహన అవసరమని, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వడ దెబ్బకు గురి కాకూడదని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాలని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహన చోదకులు కొంతసేపు నిలువ వలసి ఉంటుందని, వారికి నీడను కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, తెనాలి ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బడి పిలుస్తోంది పోస్టర్ ఆవిష్కరణ
బడి పిలుస్తోంది కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, ప్రామాణిక విద్య అందించాలనే లక్ష్యంతో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అర్హత, నైపుణ్యం గల ఉపాధ్యాయులు బోధిస్తారని, ఉచిత పుస్తకాలు పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్, బూట్లు వంటి సామాగ్రి అందించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని పేర్కొన్నారు. ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నమోదు శాతం పెంచడం, డ్రాప్‌అవుట్‌లను తగ్గించడం లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పాఠశాలకు చేరే విద్యార్థులు విధిగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మ్యాపింగ్ జరగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, ఎంఈఓ ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.
జలధార–జల హారతిపై గ్రామ ప్రణాళికలు సిద్ధం చేయాలి
‘జలధార –జల హారతి’పై గ్రామ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. జిల్లాలో అన్ని శాఖల కింద ఉన్న ప్రతి చెరువు, ప్రతి నీటి నిలువ ప్రదేశం జాబితాలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పూడికలు తీయాలని, గరిష్ట నీటి సామర్థ్యం మేరకు నిలువ చేయాల్సిందేనని అన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని చెప్పారు. ఉపాధి హామీ వేతనదారుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, తెనాలి ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, అధికారులు పాల్గొన్నారు.
26న సెన్సస్ 5 కె రన్
జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా ఈనెల 26న ‘సెన్సస్ 5కె రన్‘ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఈ రన్‌లో పాల్గొనే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లాలో స్వీయ జన గణన అందరూ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


