వందల ఏళ్లు గడిచినా పూర్తయ్యే ప్రాజెక్టు కాదు రాష్ట్ర విభజన జరిగాక ఐదేళ్లు చంద్రబాబు ఏం చేశారు? మౌలిక వసతులకే రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ ఆమోదయోగ్యం వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి
అందుకే వైఎస్ జగన్ ప్రతిపాదన
గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక ఇబ్బందులతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆచరణ సాధ్యం కాని అమరావతి రాజధాని నిర్మాణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం గుంటూరు సిద్ధార్థ నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిన 12 ఏళ్లలో రాజధాని అమరావతిలో ఎటువంటి పురోగతి లేదన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇచ్చినా చంద్రబాబు అతి తెలివి, అవినీతి, స్వార్థంతో పెద్ద రాజధానిని నిర్మిస్తానని క్షేత్రస్థాయిలో సాధ్యం కాని ప్రాజెక్టును తలకెత్తుకున్నారని ఆరోపించారు. అమరావతి అనేది ఓ అంతులేని కథ అని, చంద్రబాబు జీవితంలో కాదు కదా, వందల ఏళ్లలో సైతం పూర్తి చేసేందుకు వీలుపడని ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. తాత్కాలిక నిర్మాణాలతో కాలం వెళ్లబుచ్చారని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరావతి నిర్మాణం పేరుతో అవినీతి, కాంట్రాక్టర్లకు డబ్బులు దోచి పెట్టేందుకు, కమీషన్లు దండుకునేందుకు తప్ప రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం లేని పనులు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలు
ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు బీజేపీకి శత్రువైన కాంగ్రెస్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఓ వైపు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చి, మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతలు డిన్నర్లు చేయడం ద్వారా చంద్రబాబు మరోసారి తన ఊసరవెల్లి రాజకీయాన్ని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు.
జర్నలిస్టులు, నేతల అరెస్టులేంటి?
లోకేష్ వందల సంఖ్యలో యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తూ మావిగన్ అంటే బూతు మాట అని భారీ ఎత్తున ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. చంద్రబాబు తిరిగి డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారన్నారు. సీనియర్ జర్నలిస్టు అయిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పూడి శ్రీహరి వంటి వారి అరెస్టులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో కేవీఆర్ అనే ఓ జర్నలిస్టు ఇంటికి ఆంధ్రా పోలీసులు అర్ధరాత్రి వెళ్లి ఆయన వచ్చే వరకూ వెళ్లమని చెప్పారని అన్నారు. జర్నలిస్టులు, రాజకీయ నాయకులపై పోలీసులను వాడాలనే పరిస్థితికి చంద్రబాబు దిగజారారని, పైవాళ్లు చెప్పారని పోలీసులు ఇలాంటి పనులు చేస్తే వారే ఇరుక్కుపోతారని హెచ్చరించారు.
అమరావతిలో భవన నిర్మాణాలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు వెచ్చించడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు?. రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కోసమే రూ.రెండు లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేయగా, క్షేత్రస్థాయిలో వాటిని పూర్తి చేసేందుకు రూ.నాలుగు లక్షల కోట్లకు ఖర్చు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. మిగతా భవనాలకు రూ.లక్షల కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఆర్థికంగా ఇది రాష్ట్రానికి భారమేనన్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా, అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదన తెచ్చారని, దీంతో చంద్రబాబు గుండెల్లో రాయి పడిందన్నారు. ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారని టీడీపీ పెద్దలు బూతులతో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారని అన్నారు. 2050కి 35 లక్షల నుంచి 50 లక్షల మంది అమరావతిలో నివశిస్తారని చంద్రబాబు చెబుతుండగా, ప్రస్తుతం అక్కడ ఉన్న జనాభా వేల మందే అని అర్థమవుతోందన్నారు. వైఎస్ జగన్ చెప్పిన మావిగన్‌లో ఇప్పటికే 35 లక్షల నుంచి 45 లక్షల మంది నివసిస్తున్నారని తెలిపారు.


