గుంటూరు వెస్ట్: భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను సమీపంలోని కార్మికశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి సహాయంగా రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేలు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ నాలుగు సంక్షేమ పథకాలను పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాకు డబ్బులు జమచేసే విధంగా అమలుచేస్తారని వివరించారు. సంక్షేమ పథకాలకు అర్హులైన భవన నిర్మాణ రంగ కార్మికులు తమ గుర్తింపు కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయం డిజిటల్ సెక్రటరీ, ఎడ్యుకేషనల్ సెక్రటరీల ద్వారా అర్జీ దాఖలు చేయవచ్చని సూచించారు. జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు గల కార్మికులందరూ దగ్గరలోని కార్మికశాఖ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలని తెలిపారు. ప్రస్తుతం గుర్తింపు కార్డు కలిగిన భవన నిర్మాణ కార్మికులు ఆ కార్డును నవీకరించుకోవాలని కోరారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అందజేసే సంక్షేమ పథకాలకు ఈ కార్డు కలిగిన కార్మికులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ


