గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతరంలో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం సాధికారికతను పెంపొందిస్తూ దృఢమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(వైహెచ్‌ఏఐ) పనిచేస్తోందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వీవీజే సోమరాజు పేర్కొన్నారు. వైహెచ్‌ఏఐ గుంటూరు యూనిట్ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని 1,300 అడుగుల ఎత్తులో ఉన్న ’సర్పాస్’ మంచు పర్వతారోహణకు బయల్దేరిన 60 మంది పర్వతాహరోహకులకు ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల ఆవరణలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ జర్మనీకి చెందిన రిచర్డ్ షేర్మాన్ 1909లో యూత్ హాస్టల్స్ ఉద్యమాన్ని ప్రారంభించగా, మన దేశంలో 1946లో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్థాపించారని వివరించారు. గుంటూరు యూనిట్ చైర్మన్ డాక్టర్ కె.కొండయ్య మాట్లాడుతూ వైహెచ్‌ఏఐకు అనుబంధ సంస్థగా రాష్ట్రంలో 700 మంది అత్యధిక సభ్యులతో ఉన్న గుంటూరు యూనిట్ గత 10 ఏళ్లుగా అనేక ట్రెక్కింగ్ కార్యక్రమాలతో పాటు సముద్ర స్నానం, సైకత సాధన, పర్వతారోహణ, అవరోహణ, రాఫ్టింగ్, ఫ్యామిలీ క్యాంపింగ్ వంటి సహజ కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. కొండవీడు, సూర్యలంక, కొండపల్లి, పరిటాల, మూలపాడు, పుట్టకోట, లంబసింగి, అరకు, తలకోన, శేషాచలంతో పాటు చార్‌దామ్ యాత్ర, నేపాల్, ముక్తినాథ్, వంటి సాహస యాత్రలను ప్రోత్సహిస్తూ యువతలో దేశభక్తి, జాతీయ భావం ఐక్యత కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోతురాజు, గుంటూరు యూనిట్ అధ్యక్షుడు తుపాకుల చంద్రశేఖర్, కార్యదర్శి రవి కిరణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి భాను భాస్కర్ రావు, కోశాధికారి సుధాకర్ తదితరులు జెండా ఊపి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.


