జీజీహెచ్‌లో బకాయిల రోగం గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో క్యాథల్యాబ్, ఎమ్మారై వైద్య సేవలు ప్రైవేటు వ్యక్తులు అందిస్తున్నారు. వీరితోపాటు సంగం పాల ఉత్పత్తుల నిర్వాహకులు రెండు షాపులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఫొటో స్టాట్ షాపు, టీ స్టాల్ షాపులు ఉన్నాయి. వీరు కలెక్టర్ అనుమతితో వ్యాపారాలు చేస్తున్నారు. నామినల్‌గా జిల్లాలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ అద్దెతో జీజీహెచ్‌లో వ్యాపారాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతినెలా జీజీహెచ్ అధికారులకు చెల్లించాల్సిన అద్దె బకాయిలు వ్యాపారస్తులు చెల్లించడం లేదు. అంతేకాకుండా కరెంటు బిల్లులు సైతం చెల్లించకుండా చోద్యం చూస్తున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
సాధారణంగా అద్దె బకాయిలు, కరెంటు బిల్లులు చెల్లించనివారికి నెల, రెండు నెలలు గడువు ముగిసిన తరువాత నోటీసులు ఇవ్వడం పరిపాటి. ప్రైవేటు వ్యక్తులు అద్దె చెల్లించని వారిని, కరెంటు బిల్లులు కట్టని వారిని తమ ప్రాంగణం నుంచి ఖాళీ చేయించి వేరే వారికి ఇస్తారు. కానీ జీజీహెచ్ అధికారులు కనీసం నోటీసులు ఇవ్వరు. వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేయడం లేదు.
ఆసుపత్రి అభివృద్ధి సంఘం (హెచ్‌డీఎస్) చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, సభ్యులుగా పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు ఉన్నారు. ప్రతి నెలా లేదా మూడు నెలలకొకసారి హెచ్‌డీఎస్ సమావేశాలు నిర్వహించి, ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కనీసం అలాంటి సమావేశాల్లోనైనా ఆసుపత్రి అధికారులు జీజీహెచ్‌లో పేరుకుపోతున్న మొండి బకాయిల గురించి అజెండాలో పెట్టకుండా, చర్చించకుండా వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతున్నారు. ఆసుపత్రిలో నిధుల కొరతతో హెచ్‌డీఎస్ అకౌంట్ ఎన్నడూ లేని విధంగా అల్లాడుతోంది. ఆసుపత్రిలో వ్యాపారాలు చేసేవారి వద్ద నుంచి సకాలంలో నిధులు సేకరించడం ద్వారా హెచ్‌డీఎస్ అకౌంట్‌కు నిధులు సమకూరుతాయి. జిల్లా కలెక్టర్ ఈ నిధులపై దృష్టి సారించాలని, ఆసుపత్రికి బకాయిలు చెల్లించకుండా వ్యాపారాలు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
● రూ. లక్షల్లో పేరుకుపోయినా
చెల్లించని వ్యాపారులు
● వసూలుకు కనీసం చర్యలు
చేపట్టని ఆసుపత్రి అధికారులు
● హెచ్‌డీఎస్‌కు నిధుల కొరత
ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం
కనీసం నోటీసూ లేదు..
హెచ్‌డీఎస్ ఆదాయానికి గండి
గుంటూరు జీజీహెచ్‌లో వ్యాపారాలు చేస్తున్న వారిలో కొందరు నెలల తరబడి.. మరికొందరు సంవత్సరానికి పైబడి కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. అద్దెలు కట్టడం లేదు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కొక్కరు రూ. లక్షల్లోనే కరెంటు బిల్లులు, అద్దె చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చర్చనీయాంశం అయింది.