ఆప్కాస్‌.. వెతనాలు! | - | Sakshi
Sakshi News home page

ఆప్కాస్‌.. వెతనాలు!

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు ఈఎంఐలకు, కుటుంబ పోషణకూ అవస్థలు పడుతున్న సిబ్బంది సీడీఎంఏ వెబ్‌సైట్‌ అందుబాటులోకి రాక పన్నుదారులకు అవస్థలు సమస్యల పరిష్కారంలో జీఎంసీ అధికారుల నిర్లక్ష్యం

అందుబాటులోకి రాని సీడీఎంఏ సైట్‌

నెహ్రూనగర్‌ : ఇచ్చేదే అంతంతమాత్రం జీతాలు.. అవీ సకాలంలో అందకపోవడంతో ఆప్కాస్‌ కింద పనిచేసే ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలో ఆప్కాస్‌ కింద సుమారు 3 వేల మంది వరకు ఉన్నారు. ఈ నెల ఇంకా జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం దీనిపై స్పష్టత ఇచ్చేవారు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

స్పందించే వారేరి?

గుంటూరు నగరపాలక సంస్థలో 9వ తేదీ వచ్చినప్పటికీ జీతాల జమపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ప్రజారోగ్య విభాగంలో పనిచేసే పారిశుద్ద్య కార్మికులు, ఇంజనీరింగ్‌, ఇతర విభాగాల్లో పనిచేస్తే ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వారికి జీతాలు జమ చేసే అంశంలో స్పందించడం లేదు. నగరపాలక సంస్థ అధికారులు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీతం సమయానికి పడకపోవడంతో ఈఎంఐలు కట్టాల్సిన వారు సకాలంలో కట్టకపోవడంతో చెక్‌లు బౌన్స్‌ అవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జీతాలు అందే విధంగా తగిన చొరవ చూపాలని కార్మికులు కోరుతున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నెల చివరి మాసం కావడంతో ఏప్రిల్‌ నెలలో 2026– 27 సంవత్సరానికి ఆస్తి డిమాండ్‌ జనరేట్‌కు సంబంధించి సీడీఎంఏ (కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ ఆడ్మినిస్ట్రేషన్‌) సైట్‌ ప్రాసెస్‌ చేస్తుంటారు. ఈ ప్రాసెస్‌ ఇంకా పూర్తి కాకపోవడంతో ట్యాక్సులు చెల్లించే వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు జనన, మరణ ధ్రువపత్రాలు, ఇతర సేవలు పొందేందుకు సీడీఎంఏ పోర్టల్‌ ద్వారానే లావాదేవీలు జరుపుతుంటారు. 9వ తేదీ వస్తున్నప్పటికి సైట్‌ అందుబాటులోకి రాకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం స్పందించి త్వరితగతిన సీడీఎంఏ సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు సేవలందించాలని నగర వాసుల కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement