అమరావతి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన అమరావతిలోని కాలచక్ర మ్యూజియాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సందర్శించారు. మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న జిల్లా పర్యాటక మండలి సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభ్యర్థన మేరకు కలెక్టర్ మ్యూజియాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాలచక్ర మ్యూజియంలో శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. విదేశాలకు తీసుకువెళ్లిన శిల్పాలను వీలైనంత త్వరగా ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ పనులను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కనీస అవసరమైన పనులను పూర్తిచేసి, మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. 15వ తేదీన అమరావతిలో పర్యాటకశాఖ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ యూనిట్ ఇన్‌చార్జి మణికుమార్, డీఈ కుమార్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతి పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
చందోలు(కర్లపాలెం): పిట్టలవాని పాలెం మండలం చందోలులో వేంచేసియున్న శక్తి స్వరూపిణి బగళాముఖి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి మే 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహ మూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారి భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పండ్లు, తాంబూలం, అమ్మవారి ప్రసాదాలను వారికి అందజేశారు. అభివృద్ధి కమిటీ చైర్మన్, ఈవో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్‌లలో వెళ్లి అమ్మ వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
యడ్లపాడు: చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచే కొండవీడు కోట, ఇప్పుడు సాహస పర్యాటకానికి వేదిక కానుంది. జిల్లా పాలన యంత్రాంగం, అటవీశాఖ, అవుట్ రైవల్ అడ్వెంచర్స్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నుంచి కొండవీడు కొండలపై నైట్ టెంట్ క్యాంప్ ఫైర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొండల నడుమ గడిపేలా ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. సాహసయాత్ర శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని, అతిథుల కోసం కొండపై అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెంట్లను సిద్ధం చేసినట్లు వివరించారు. రాత్రి వేళ మ్యూజికల్ నైట్ స్వరాలు, క్యాంప్ ఫైర్ వెలుగులు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతాయన్నారు. వీటికి తోడు స్థానిక రుచులతో కూడిన అల్పాహారం, విందు ఉంటుందని, మరుసటి రోజు ఉదయం ప్రకృతి అందాల మధ్య సాగే ట్రెక్కింగ్, ఉత్సాహాన్ని నింపే బోటింగ్, కయాకింగ్ వంటి సాహస క్రీడలు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. పెద్దలకు రూ.2 వేలు, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ.వెయ్యిగా రుసుమును నిర్ణయించారు. ఇందులో భోజన, వసతి సదుపాయాలన్నీ కలిపి ఉండటం పర్యాటకులకు కలిసొచ్చే అంశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.


