రసీదు ఇవ్వాలని ఎస్‌ఐ నాగేంద్రను నిలదీసిన అంబటి అరగంట తరువాత ఇస్తానంటూ సమాధానం దాటవేత
లక్ష్మీపురం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా పెట్టుకుని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కార్యక్రమంలో అవమానకరమైన, సామాజికంగా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా వ్యక్తిగత గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశారని పేర్కొన్నారు. మహిళలను అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దీనిపై రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ప్రసారాలను చూసిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతో పాటు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా రూపొందించబడినదని స్పష్టంగా తెలుస్తోందన్నారు. బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదా, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ఆచారి, వంగల వలివీరారెడ్డి, బూసి రాజలత, గేదెల రమేష్, పార్టీ లీగల్ నగర అధ్యక్షుడు సెల్ రామకృష్ణారెడ్డి, న్యాయవాదులు వేముల ప్రసాద్, కోటేశ్వరరావు, మొండితోక శ్రీనివాసరావు, మాజీ మిర్చి యార్డు డైరెక్టర్ ప్రభు, గ్రంథాలయ మాజీ జిల్లా చైర్మన్ బత్తుల దేవానంద్, పిల్లి మేరి, పార్టీ నాయకులు షేక్ షరీఫుద్దీన్, అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రసీదు ఇవ్వని ఎస్‌ఐ
పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబు పార్టీ లీగల్ సెల్ నాయకులు, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఎస్‌ఐ నాగేంద్రకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించి రసీదు ఇవ్వాలని అంబటి కోరడంతో ఉన్నతాధికారులను సంప్రదించి ఇస్తానని పేర్కొని అరగంట సేపు తరువాత రసీదు ఇస్తానని చెప్పారు. దీనిపై సామాన్య వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసినా రసీదు ఇవ్వాలన్న నియమం ఉందని ఎస్‌ఐను అంబటి నిలదీశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తానని, అలాగే న్యాయశాఖలో సైతం ఫిర్యాదు చేస్తానంటూ చెప్పారు.


