పట్టించుకునే దిక్కేది?
● సెల్ఫ్ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘన
● విద్యార్థికి రూ. ఆరు వేల నుంచి
రూ.పది వేల వరకూ వసూలు
● పత్తా లేని పరిశీలకులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పరీక్ష ఏదైనా డబ్బులు వసూలు చేయడం, చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడం ఆనవాయితీగా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్‌చార్జుల పాలన సాగుతుండటం, ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తుండటంతో వర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకీ మసకబారుతోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎం ఫార్మసీ రెండో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలు, మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు కేంద్రాలుగా సెల్ఫ్ సెంటర్ కేటాయించడం.. పరిశీలకులు పత్తా లేక అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది.
యథేచ్ఛగా....
ఫార్మసీ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్న పలువురు ఎం ఫార్మసీ కోర్సును కళాశాలలకు రాకుండా కేవలం పరీక్షకు మాత్రమే హాజరు అయ్యారు. సబ్జెక్టుపై కూడా అవగాహన లేకపోవడంతో ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపల్స్ డబ్బులు తీసుకుని విద్యార్థులకు చూచిరాతకు అవకాశం ఇచ్చారు. దొడ్డి దారిన ఉద్యోగం పొంది.. దోచు కోవటమే ధ్యేయంగా వ్యవహరించే అక్రమార్కుల అండతో వర్సిటీ ప్రతిష్ట దిగజారింది. లా, బీఈడీ లాంటి కోర్సులకు ఇతర సెంటర్లను వేస్తున్నారు. దీంతో పల్నాడులోని కొన్ని సెంటర్లలో ఇష్టారాజ్యంగా ఈ పరీక్షలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. కొన్ని సెంటర్లలో పేపర్‌కి రూ.ఆరు వేల నుంచి రూ. పది వేల వరకూ వసూలు చేశారు. కొన్ని కళాశాలల్లో సప్లిమెంటరీ పరీక్షలకు రూ.రెండున్నర వేల నుంచి రూ.మూడు వేల వరకు తీసుకున్నారు. ఒక్కొక్క పరిశీలకుడికి విద్యార్థి నుంచి రూ.500 చొప్పున కాపీయింగ్ ఫీజు అంటూ దండుకున్నారు. పల్నాడులోని కేంద్రాల్లో సెల్‌ఫోన్లలో చాట్ జీపీటీ ద్వారా అన్ని పరీక్షలు చూసి రాయటానికి రూ.12 వేలు వసూలు చేస్తున్నారు. గుంటూరు సమీపంలోని ఒక సెంటర్లో రూ.10 వేలు ప్యాకేజీగా తీసుకుంటున్నారు. నరసరావుపేటలో ఒక కళాశాల లెక్చరర్ దళారీగా వ్యవహరిస్తూ ఒక్కొక్క కళాశాల నుంచి రూ.25 వేలు నిర్వహణ ఫీజు పేరుతో కొందరు అధికారుల పేరిట వసూలు చేశారు. పల్నాడులోని ఒక సెంటర్లో పరీక్ష రాసుకోవడానికి అదనపు సమయం ఇవ్వడానికి రూ.500 వసూలు చేశారు. నరసరావుపేట, ఫిరంగిపురం సమీపంలో ఒక సెంటర్లో, తెనాలిలోని ఒక సెంటర్లో, పల్నాడులో ఉన్న ఒక కళాశాలలో భారీగా కాపీయింగ్ జరుగుతున్నట్టు ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లాయి.
రెగ్యులర్‌గా ఉద్యోగం చేయకుండా, కేవలం పేపర్ల మీద మాత్రమే లెక్చరర్‌గా వ్యవహరించే వారిని పరిశీలకులుగా నియమించడంతో కాపీయింగ్ చేయడం సులువుగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా వారే పరిశీలకులుగా వ్యవహరించటంతో యాజమాన్యాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వారికి ముడుపులు ముట్టచెబుతున్నారు. నగరంలోని ఒక కేంద్రంలో ఉదయం ఫార్మసీ పరిశీలకులుగా వ్యవహరించిన వ్యక్తే మధ్యాహ్నం నుంచి సైకాలజీ ఎగ్జామినర్‌గా బీఈడీ పేపర్లను మూల్యాంకనం చేయడం గమనార్హం. మరో వ్యక్తి ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో ఒకవైపు బీఈడీ ప్రాక్టికల్ ఎగ్జామినర్‌గా హాజరవుతూ.. అదే సమయంలో ఏఎన్‌యూలో ఫార్మసీ పరీక్షల విధులు నిర్వహించారు. తనిఖీ బృందాలలో వర్సిటీ వారితోపాటు పల్నాడులోని వేరువేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరిని నియమించారు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు తనిఖీల తీరు మారింది.


