మా ఇళ్లను రైల్వే అధికారులను కూలుస్తున్నారని, దానిని ఆపాలని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వద్దకు వెళ్లి సమస్య చెబితే చౌడవరం వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. మౌలిక వసతులు లేకపోవడంతోపాటు ఇంటి పెచ్చులు ఊడిపోవడం చూసి భయం వేసి వచ్చేశాం. జగనన్న కాలనీల్లో కోర్టు కేసులో ఉందని ఎమ్మెల్యేనే చెబుతున్నారు. ఇంకా తాము ఎక్కడికి వెళ్లాలని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే అద్దెలకు వెళ్లండి అని చెబుతున్నారు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, నారా లోకేష్‌కు విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెలే చెప్పినట్లుగా అద్దెలకు వెళ్లే పరిస్థితులు మావి కావు. ఇక్కడ పనులు చేసుకుంటేనే బతికేది. అలా కట్టే స్థోమతే ఉంటే కాలువ వెంట ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రత్యామ్నాయం చూపించి మా ఇళ్లను తొలగించండి. లేదంటే ఆ మిషన్లు మా మీదకు పంపించి చంపేసి ఇళ్లు కూల్చేయండి. – డేరంగుల శివకుమారి
నాకు కొడుకులు లేరు. కుమార్తె దగ్గరే ఉండి ఫించన్ డబ్బులతో బతుకుతున్నాను. ఇప్పుడు అర్ధాంతరంగా రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయమని చెబుతున్నారు. ఇప్పటికప్పుడు వేలకు వేలు అద్దెలు కట్టి బయటకు వెళ్లి జీవించే స్థామత మాకు లేదు. అధికారులు, పాలకులు దయుంచి ప్రత్యామ్నాయం చూపాలి. అందరికీ ఒకే చోట నివాసాలు ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్లిపోతాం.
– బూర్సు వెంకాయమ్మ


