తెనాలి: యుద్ధ నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్త్తుందో అర్థంకాని పరిస్థితి. ఆయా దేశాల్లోని తమ వారికోసం ఇక్కడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. కువైట్‌లోని ఇంటర్నేషనల్ స్కూలులో ఆర్ట్ టీచర్‌గా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పట్టణ గంగానమ్మపేటకు చెందిన ఎ.శివనాగేశ్వరరావును ‘సాక్షి’ ఫోనులో పలకరించింది. అక్కడి పరిస్థితి ఆయన మాటల్లోనే... ‘‘నేను రెండు దశాబ్దాలకు పైగా కువైట్‌లో సీబీఎస్‌ఈ బోర్డు పరిధిలోని ఇంటర్నేషనల్ స్కూలులో ఆర్ట్ టీచర్‌గా పనిచేస్తున్నా. యుద్ధం నేపథ్యంలో యూఏఈలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలపై ఇరాన్ గురిపెడుతోంది. ఆర్థిక వనరులైన ఆయిల్‌ఫీల్డ్స్, రిఫైనరీలపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. కువైట్‌లో చాలా రిఫైనరీలున్నాయి. ఇక్కడ సరిహద్దుల్లో అమెరికాకు చెందిన సైనిక స్థావరాలున్నాయి. కువైట్ ప్రభుత్వం, అగ్నిమాపక శాఖ చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ప్రతి పేటకో ఫైర్ స్టేషన్ ఉంటుంది. నిమిషాల్లోనే ప్రమాదస్థలానికి సిబ్బంది చేరుకుంటారు. దాడికి గురైన రిఫైనరీలోని మంటలను గంటల వ్యవధిలోనే కంట్రోలు చేయగలుగుతున్నారు.
ఇళ్లపై దాడులు లేవు..
జనావాసాలపై దాడులు జరగకపోవటంతో అందరం క్షేమంగానే ఉన్నాం. జనజీవితం సాధారణంగానే ఉంటోంది. కువైట్ ప్రభుత్వం తెలుగువారిని కూడా గుర్తించింది. భద్రతకు సంబంధించిన హెచ్చరిక సందేశాలను తెలుగు భాషలోనే పంపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు
30 శాతం సిబ్బందితో రెండు షిఫ్టులుగా నడుస్తున్నాయి. ఇండియాలోని సీబీఎస్‌ఈ బోర్డు పరిధిలో నడుస్తున్న యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీఅరేబియా దేశాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల సమయం. 1 నుంచి 9 తరగతుల వరకు, 11వ తరగతి పరీక్షలు రద్దుచేశారు. ఆయా తరగతుల విద్యార్థులకు యూనిట్ టెస్టుల్లో వచ్చిన మార్కులను లెక్కించి ఆ ప్రకారం పై తరగతులకు ప్రమోషన్ ఇస్తారు. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ జూన్‌లో వేసవి సెలవులు ఇస్తారు.
గతంలో కువైట్ పౌరులకు కూరగాయలు భారతదేశం నుండి వస్తుండేవి. అయిదారేళ్లుగా ఈ పరిస్థితి మారిపోయింది. సమీప ఎడారి దేశాల నుంచే కూరగాయలు ఇప్పుడు వస్తున్నాయి. కువైట్‌లోనూ కూరగాయలను పండిస్తున్నారు. క్యాబేజి, కాలీఫ్లవర్, తమ్మకాయలు, బంగాళాదుంపలు, టమాటా, మునగ, ఆకుకూరలను పండిస్తున్నారు. గతంలో ఎక్కువగా ఖర్జూర పండించేవారు. కొంతకాలంగా ప్రభుత్వం సబ్సిడీనిచ్చి మరీ కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో మునగ తోటలను బాగా వేస్తున్నారు. టీలోనూ మునగ ఆకును వినియోగిస్తున్నారు. ఇప్పటివరకై తే అంతా బాగానే ఉన్నాం.’’
పాఠశాలలకు సెలవులిచ్చి ఆన్‌లైన్‌లో బోధన
ప్రభుత్వ కార్యాలయాల్లో షిప్టులవారీగా విధులు
సాధారణంగానే జనజీవనం
తెలుగులోనే ప్రమాద హెచ్చరికల జారీ
కువైట్ నుంచి చిత్రలేఖన ఉపాధ్యాయుడు
శివనాగేశ్వరరావు


