పడకేసిన పాలన...
పాట్లు పట్టని పాలకులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఓ సదస్సు విషయంలో సీనియర్ మహిళా ఆచార్యులు గవర్నరుకు ఫిర్యాదు... పీహెచ్‌డీ సంతకం వ్యవహారంలో మరో మహిళా ప్రొఫెసర్‌కు వేధింపులు... ఇలా ఏఎన్‌యూలో ఇన్‌చార్జి పాలనలో మహిళా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కొందరి తీరుతో ఆవేదన చెందుతున్నారు. పదవుల కోసం పాకులాడటం తప్ప. విశ్వవిద్యాలయం భ్రష్టుపడుతున్నా పట్టించుకోని తాత్కాలిక పాలకుల ఉదాసీనత యూనివర్సిటీ ప్రతిష్టను మంట కలుపుతోంది. గత 18 నెలల తాత్కాలిక పాలకుల హయాంలో కొందరు మహిళా ఉద్యోగులు రాత పూర్వకంగా, మరి కొందరు మౌఖికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. తమ పదవులు నిలుపుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తున్న వివాదాస్పద అధికారులు విద్యావ్యవస్థను దిగజారుస్తున్నారు. మహిళలపై బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు.
వారి వెతలెన్నో..
వర్సిటీలో గత ఏడాదిన్నర పాలనలో అనేక మంది మహిళా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక ఉన్నతాధికారి అండతో బాడీ షేమింగ్‌కు పాల్పడటం, మహిళలను దూషించటం, బెదిరించటం చేసినా పట్టించుకునే నాథుడే లేరని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వర్సిటీలోని ఒక కీలక వ్యక్తిపై సీనియర్ మహిళా అధ్యాపకురాలు ఒకరు గవర్నరుకు, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆ మహిళా ఆచార్యురాలికి అవమానం జరిగినా స్పందన లేదు. పీహెచ్‌డీ వ్యవహారంలో ఒక మహిళా ప్రొఫెసర్‌ను నిబంధనలకు విరుద్ధంగా సంతకం చేయాలని ఓ అధికారి ఒత్తిడికి గురిచేశారు. సదరు వ్యక్తిపై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా స్పందన లేదు. ఒక దళిత మహిళాధికారిపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని ఒకరు దూషించిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు లేవు.
దూరవిద్యలో గత అక్టోబరు నెలలో ఒక మహిళా అధికారి నాన్ టీచింగ్ ఉద్యోగిపై ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇటీవల ఒక మహిళా ప్రొఫెసర్‌పై నేరుగా ఒక వివాదాస్పద వ్యక్తి వాగ్వివాదానికి దిగినా ఇతర ఆచార్యులు ప్రేక్షకుల్లా వ్యవహరించారేగానీ వర్సిటీకే శాపంగా మారిన సదరు అయ్యవారిని ఇదేం తీరు అని ఒక్క మాట అనలేదు. పరీక్ష భవన్‌లో ఒక నాన్ టీచింగ్ ఉద్యోగి కిందిస్థాయి మహిళా ఉద్యోగిని వేధించినా పట్టించుకోలేదు. ఒక అధికారి ఉద్యోగులతో సమావేశాలు పెట్టడం, సంబంధం లేని విషయాలు చెప్పి అసభ్య పదజాలం వాడుతున్నారని ఆ విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగులే వాపోతున్నారు. ఇన్‌చార్జి వీసీ పాలనలో ఒక మహిళా స్కాలర్‌ను ప్రొఫెసర్ కారుతో ఢీకొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని సంగతి తెలిసిందే.
ఇన్‌చార్జి అధికారుల పాలనలో ఏఎన్‌యూలోని పాలన పూర్తిగా పక్కదారి పట్టింది. కొందరు వివాదాస్పద అధికారులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పేట్రేగిపోతున్నారు. ఎడ్యుకేషన్ ఫర్ సేల్ అంటూ వ్యాపారంగా మార్చినా, మహిళా ఉద్యోగులను దూషించినా వారికే కమ్మని న్యాయం చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఆదేశించినా పచ్చ పైత్యంతో వర్సిటీకి శాపంగా మారిన కళంకిత అధికారులకు కొమ్ముకాస్తున్నారు. ఏఎన్‌యూ అన్ని విధాల అప్రతిష్ట పాలయినా, విద్యను వ్యాపారంగా మార్చినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.


