గుంటూరు లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 31వ తేదీన జరుగుతాయని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగళ శెట్టి శివ సూర్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16,17 తేదీల్లో నామినేషన్ల దాఖలు, 23 ఉపసంహరణకు తుది గడువు.. అదేరోజు సాయంత్రం 4 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. 31వ తేదీ ఎన్నికలు.. అదేరోజు సాయంత్రం లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఉద్యోగోన్నతులకు సంబంధించి అర్హులైన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కేడర్ల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక, జనరల్ సీనియారిటీ జాబితాను సంబంధిత ఉపాధ్యాయుల అర్హతల ఆధారంగా సబ్జెక్టుల వారీగా డీఈవో.జీఎన్‌టీ.బ్లాగ్‌స్పాట్.కామ్‌లో ఉంచినట్లు తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సంబంధిత అధికారి ద్వారా తగిన ధ్రువపత్రాలతో ఈనెల 22లోపు సాయంత్రం 3.00 గంటల నుంచి 7 గంటల వరకు అన్ని పనిదినాల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వినతుల స్వీకరణ కమిటీకి సమర్పించాలని సూచించారు. నిర్దిష్ట గడువు అనంతరం అందిన వినతులు స్వీకరించబడవని పేర్కొన్నారు.
గుంటూరు రూరల్: వాణిజ్య అవసరాలకు, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా రూరల్ మండలం దాసరిపాలెంలో బ్లూ వేల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో తనిఖీ చేయగా 4 గృహ వినియోగ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చౌడవరం లలితాపీఠం వద్ద చెన్నుపాటి వీరయ్య అనే వ్యక్తి వద్ద తనిఖీ చేయగా 10 గృహ వినియోగ సిలిండర్లు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేశారు. తక్కెళ్లపాడు వద్ద గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో తనిఖీ చేసి 3 గృహ వినియోగ సిలిండర్లు అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలలో మొత్తం 17 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి స్థానిక సీఎస్‌డీటీలకు అప్పగించారు. అత్యవసర సరుకుల చట్టం 1955లోని సెక్షన్ 6ఏలో మొత్తం 3 కేసులు నమోదు చేసి సంబంధిత జాయింట్ కలెక్టర్‌కి నివేదిక సమర్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
నరసరావుపేట టౌన్: మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో బ్యాంక్ రుణాల్లో మోసానికి పాల్పడ్డ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ సోమవారం తెలిపారు. పిడుగురాళ్ల, నరసరావుపేట ఇండియన్, స్టేట్ బ్యాంక్‌లలో మహిళ సంఘాల పేరుతో నకిలీ గ్రూప్‌లు సృష్టించి షేక్ ఉమర్‌వలి రుణాలు మంజూరు చేయించినట్లు విచారణలో తేలిందన్నారు. మొత్తం 81 నకిలీ గ్రూప్‌ల పేరుతో రూ.9.59 కోట్లు రుణాలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్‌లో నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసులో ఇప్పటికే ఐదవ నిందితుడిని అరెస్ట్ చేయగా, మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారన్నారు.


