రైతుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 అందడం లేదు రూ.1700లకు కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్న దళారులు మార్క్‌ఫెడ్ ద్వారా కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
పొన్నూరు: రబీ సీజన్‌లో పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల నుంచి మొక్కజొన్న పంటను నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అవసరమైన అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
● ఈ రబీలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈసారి 29, 298 హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారన్నారు. ఒక్క పొన్నూరులోనే సుమారు 25 వేల ఎకరాలలో సాగు చేయగా, నియోజకవర్గంగా చూస్తే మొత్తంలో 40 వేల ఎకరాలలో పంట పండించారన్నారు. ఎప్పుడు కూడా రాష్ట్రంలోనే మొక్క జొన్న అధిక విస్తీర్ణంలో సాగు చేసే నియోజకవర్గంగా పొన్నూరుకు గుర్తింపు ఉందన్నారు.
● అలాంటి పంటకు క్వింటాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 కూడా అందడం లేదని అన్నారు.
● దళారుల ప్రభావాన్ని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల నుంచి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ రైతుల కష్టాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
● చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానం ప్రకారం ధరల స్థిరీకరణ నిధి అమలు చేయకపోవడంతోనే రైతులకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
● రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే క్రమంలో కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు.
● ప్రస్తుతం ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు మొక్కజొన్న పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
● కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ.2400 చొప్పున రైతులకు అందాల్సి ఉండగా, వ్యాపారస్తులు క్వింటాకు రూ.1700 మాత్రమే అందించి, వారు ప్రభుత్వానికి మాత్రం రూ.2400 చొప్పున విక్రయిస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
● దళారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి మార్కెట్ యార్డ్, మార్క్‌ఫెడ్ రంగంలోకి దించి రైతుల వద్ద నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, అలాగే అవసరమైన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిపించాలని అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు.


