తెనాలి రూరల్: రాడ్ బెండింగ్ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన రాడ్ బెండింగ్ కార్మికుడు నారాయణ నరేంద్ర, శ్రీవాణి ప్రేమించుకుని 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పనుల కోసం తెనాలి వచ్చి ఇక్కడి నందులపేట లెనిన్ రోడ్డులో నివసిస్తున్నారు. ఇద్దరు మగ పిల్లలు సంతానం. ఆదివారం రాత్రి అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి దాటాక మెలకువ వచ్చి చూడగా భర్త ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఉన్నాడని, తెలిసిన వారికి చెప్పి వైద్యశాలకు తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని శ్రీవాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. టూ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద సోమవారం కేసు నమోదు చేశారు.


