అచ్చంపేట: మాదిపాడు పంచాయతీ పరిధిలోని అడవిలో స్వయంభు సత్తెమ్మతల్లి దేవాలయంలో సత్తెమ్మతల్లి, సత్యదేవుళ్ల కళ్యాణ 16 రోజుల పండుగ మహోత్సవాలు సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పొంగళ్లు పొంగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ నిర్వహకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించి 16వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈనెల 1వ తేదీన అమ్మవారికి కళ్యాణం నిర్వహించామని, తిరిగి 16 రోజుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీనివాసరావు, సత్యవతి దంపతులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
అచ్చంపేట: ఉగాది పండుగను పురస్కరించుకుని స్థానిక గ్రామదేవతగా వెలుగొందుతున్న అచ్చమ్మ పేరంటాళమ్మ తల్లి మహోత్సవాలు మంగళ ,బుధ, గురు వారాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ కన్వీనర్ సూరే వెంకట సుబ్బారావు సోమవారం తెలిపారు. ప్రతి ఏటా ఉగాదికి ముందు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలిరోజు తోరణపాకు అలంకరణ, విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, మండపారాధనలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మూడు రోజుల పాటు ప్రాతఃకాల పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు, అర్చనలు, లలితాసహస్రనామ పారాయణం, పంచాంగ శ్రవణం, మహో నైవేద్యం, వేపపూత ప్రసాద పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
గుంటూరురూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18వ తేదీన గుంటూరు నగర పర్యటన ప్రతిపాదనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్‌అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌లు అందుకు అవసరమైన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్‌రోడ్ శ్రీ కన్వెన్షన్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్‌స్టాండ్ వరకు పర్యటించే అవకాశాలు ఉన్నందున వాటి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్‌ఎం సామ్రాజ్యం, ట్రాఫిక్ డీఎస్పీ బి.శ్రీనివాస్, ఈస్ట్ డీఎస్పీ అజీజ్, పాత గుంటూరు సీఐ వెంకటరావు, లాలాపేట సీఐ శివరామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీసీ సీతారామిరెడ్డి, ఈస్ట్ తహసీల్దార్ సుభాని, ఇతర శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు.


