149 కేంద్రాల్లో పరీక్షలు రాసిన 27,123 మంది విద్యార్థులు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 149 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 27,699 మంది విద్యార్థులకు గానూ 27,123 మంది హాజరయ్యారు. టెన్త్ పరీక్షల్లో మొదటి రోజు కావడంతో గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల వారీగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచి కోలాహలం నెలకొంది. విద్యార్థులను వెంట పెట్టుకుని తల్లిదండ్రులు కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షల జిల్లా నోడల్ అధికారి పి.పార్వతి వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి మంగళగిరిలో కేంద్రాన్ని, జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా ఎనిమిది కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. అదే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 38 కేంద్రాలతో పాటు రాష్ట్ర పరిశీలకులు 12 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఈవో సలీమ్ బాషా చెప్పారు.
దూరవిద్య టెన్త్ పరీక్షలకు
781 మంది హాజరు
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ప్రారంభమైన దూరవిద్య పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 970 మంది అభ్యర్థుల్లో 781 మంది హాజరయ్యారు. జిల్లా నోడల్ అధికారి పి.పార్వతి రెండు కేంద్రాలను తనిఖీ చేశారు.


