మైనింగ్‌లో నేనే కింగ్‌! | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌లో నేనే కింగ్‌!

Mar 16 2026 7:49 AM | Updated on Mar 16 2026 7:49 AM

మైనింగ్‌లో నేనే కింగ్‌!

ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా డీడీ అనుమతులు

వివాదాల కేంద్రంగా కృష్ణా జిల్లా మైనింగ్‌ శాఖ వ్యవహారం

డీడీ నిర్ణయంతో గుంటూరు జిల్లా

అన్నదాతలకు తప్పని సమస్యలు

చోడవరం మట్టి తవ్వకాలపై

బాధిత రైతుల ఆందోళన

ఇకనైనా ఈ నిర్ణయంపై ప్రభుత్వం

పునరాలోచించాలని వేడుకోలు

క్షేత్రస్థాయి పరిశీలన ఏదీ?

కృష్ణా జిల్లాలో మైనింగ్‌ శాఖలో డీడీగా పనిచేస్తున్న వ్యక్తి ఆ శాఖకు తానే రాజు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా తన కొత్త నిబంధనలతో పాత జీవోలను జోడించి అనుమతులు ఇవ్వడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఇచ్చిన ఒక అనుమతి వల్ల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పలు లంక భూముల రైతులతోపాటు రేపల్లె కరకట్ట వెంబడి ఉన్న రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాడేపల్లి రూరల్‌: కృష్ణానదిలో ఎక్కడ తవ్వకాలు నిర్వహించాలన్నా ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీవో నంబరు 49, 100లకు అనుగుణంగా జిల్లా కలెక్టర్‌ సమక్షంలో అనుమతులు ఇవ్వాల్సి ఉంది. కానీ కృష్ణా జిల్లాకు చెందిన మైనింగ్‌ శాఖ డి.డి. శ్రీనివాసరావు దానికి విరుద్ధంగా ప్రభుత్వ జీవోలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన 1966లో విడుదల చేసిన జీవోల ప్రకారం అనుమతులు ఇస్తున్నారు. గతంలో కూడా పలు క్లస్లర్‌ మిషన్లకు ఇదేవిధంగా అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అడ్డగోలుగా అనుమతులు

తాజాగా ఒక రైతు పొలం మిగతా పొలాల కన్నా ఎక్కువ ఎత్తులో ఉందని, ఇతర పొలాలతో సమానం చేసేందుకు మట్టిని తొలగించాలని, ఆ మట్టిని ఇటుక రాళ్ల బట్టీకి వినియోగించుకుంటామని ఓ టీడీపీ నేత లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. సదరు మైనింగ్‌ డి.డి. నిబంధనల ప్రకారం కలెక్టర్‌తో చర్చించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అలా కాకుండా నేరుగా ఫిబ్రవరి 4వ తేదీన అనుమతులు ఇచ్చారు. 120 రోజుల్లో ఆ పొలాన్ని చదును చేసి, వచ్చిన 13,355 టన్నుల మట్టిని తీసుకెళ్లవచ్చని అనుమతి ఇచ్చారు. లంక భూముల్లో తీసిన మట్టి ఇటుక బట్టీ రాళ్లకు పనికి వస్తుందా లేదా అనే విషయం పరిశీలించలేదు. లంక భూముల్లో నాలుగైదు అంగుళాల మందంలో ఇసుక పొరలు తగులుతాయి. అలాంటి మట్టి ఇటుక బట్టీలకు ఎలా పనికి వస్తుందని రైతుల ప్రశ్నిస్తున్నారు. మట్టి చాటున ఇసుకను తరలించేందుకు ఇలాంటి అనుమతులు తీసుకువచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్‌ శాఖ అధికారులు కనీసం ఆ భూమిని పరిశీలించకుండా అనుమతులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరీ ఇంత బాధ్యతారాహిత్యంగా అధికారులు వ్యవహరించడాన్ని ఖండించారు.

కృష్ణానదిలో లంక భూముల్లో అనుమతి ఇచ్చే సమయంలో మైనింగ్‌ శాఖ అధికారులు వివిధ శాఖల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా కొత్త జీవో నంబరు 49 ప్రకారం కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. పక్క పొలాల రైతులు ఎటువంటి అభ్యంతరం చెబుతారో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోకుండానే మైనింగ్‌ వే బిల్లులు సహా అందజేసి గ్రామ సభను నిర్వహించి ప్రస్తుతం అభిప్రాయ సేకరణ తీసుకోవడంతో మైనింగ్‌ శాఖ డి.డి. శ్రీనివాసరావు చేసిన ఈ విషయం బయటకు వచ్చింది. లంక భూముల్లో ఎక్కడ ఎత్తుపల్లంగా ఉన్నాయి, తీసిన మట్టి ఇటుక బట్టీలకు పనికివస్తుందని ఎలా నిర్ధారించారో అధికారులు తేల్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. చోడవరం లంక భూముల్లో మట్టి తవ్వకాలు నిర్వహిస్తే మిగిలిన రైతులకు చావే శరణ్యం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లంక భూముల్లో మట్టి తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను పునరాలోచించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement