నేటి నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు ఉచిత ప్రయాణ అవకాశం హాల్ టిక్కెట్‌తో వస్తే పరీక్ష రాయొచ్చు ఏర్పాట్లను తనిఖీ చేసిన ఆర్జేడీ, డీఈవో గుంటూరు కార్పొరేషన్ పాఠశాల కేంద్రాల్లో కనిపించని బోర్డులు
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థి జీవితానికి తొలిమెట్టు వంటి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 149 కేంద్రాల పరిధిలో 27,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం 8.30 నుంచి ఆయా కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. పాఠశాలల్లో హెచ్‌ఎంలు నుంచి పొందిన, వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్లతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా పరీక్ష రాసేందుకు వెళ్లవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టిక్కెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
అధికారుల పరిశీలన
ఆదివారం గుంటూరు నగరంలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి, డీఈవో షేక్ సలీమ్ బాషా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆర్జేడీ, డీఈవోలు వేర్వేరుగా 20 కేంద్రాల చొప్పున పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద కోడ్ నంబరుతో కూడిన బోర్డులు, రోల్ నంబర్లు ప్రదర్శించడం, మౌలిక వసతులను తనిఖీ చేశారు. సోమవారం ఉదయం పరీక్షలు ప్రారంభం కానుండగా, గుంటూరు నగర పరిధిలోని పలు కేంద్రాల వద్ద సెంటర్ కోడ్ నంబర్లు కనిపించలేదు. కేవీపీ కాలనీలోని కేఎస్‌ఆర్‌టీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులకు కనిపించేలా సెంటర్ కోడ్ నంబరు, రోల్ నంబర్లతో కూడిన వివరాలను ప్రదర్శించలేదు.


