మేట..బడా బాబులకు మేత | - | Sakshi
Sakshi News home page

మేట..బడా బాబులకు మేత

Mar 14 2026 7:52 AM | Updated on Mar 14 2026 7:52 AM

పట్టా భూముల్లో తవ్వేందుకు రంగం సిద్ధం రైతులకు శాపమే

కృష్ణానది

దిశ

మారితే...

కృష్ణా జిల్లా చోడవరంలో ఇసుక రీచ్‌కు అనుమతులు

గుంటూరు జిల్లా రైతులకు శాపం

నది దిశ మార్చుకుంటే వేలాది ఎకరాల్లో పంట కొట్టుకుపోయే ప్రమాదం

ఆందోళన వ్యక్తం చేస్తున్న లంక భూముల రైతులు

మా భూమి నదిలో కలిసిపోతుంది

వలస వెళ్లాల్సిందే..

వివిధ శాఖల అధికారులు సమన్వయలోపం వల్ల ఇష్టారాజ్యంగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. ఈ అనుమతులు రైతులకు శాపంగా మారుతున్నాయి. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపు పేరుతో అనుమతుల వల్ల రాబోయే రెండు మూడేళ్లలో లంక భూములు కనుమరుగు అవుతాయి. వేలాది మంది రైతులు నష్టపోతారు. పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుంది.

–ముసునూరు సోహాస్‌, ఏపీ రైతు సంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు

తాడేపల్లిరూరల్‌: కృష్ణానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకునేందుకు బడా బాబులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది. దీనిపై లంక భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రాంతంలో ఇసుక తవ్వేటప్పుడు కనీసం అక్కడ ఉన్న రైతులను సంప్రదించాల్సి ఉంది. కానీ ఇష్టారాజ్యంగా తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో లంక భూములు మాయమవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల లంక భూములు కృష్ణానదిలో కలిసిపోయాయి. కృష్ణాజిల్లా చోడవరం గ్రామంలో ఇసుకరీచ్‌–2కు అనుమతులు ఇవ్వడం, చోడవరం ప్రాంతంలోనే ఓ బడా బాబు భూమిలో ఇసుక మేట వేసిందంటూ చెబుతూ దానిని తొలగించేందుకు అనుమతులు తెచ్చారని వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లోని లంక భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు ఒక మీటరుకు ఇస్తే ఐదారు మీటర్లు తవ్వుతారని, అధికారుల పర్యవేక్షణ ఉండదని, దీంతో దిగువ ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాలు చిన్నపాటి వరదకు పంటలు కొట్టుకుపోతాయని, అధికారులు కనీసం పరిశీలించకుండా అనుమతులు ఇవ్వడం ఏమిటంటూ ఆ ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దిగువ ప్రాంతం వైపు లంక భూములు పల్లంగా ఉంటాయని, ఎత్తుగా ఉన్న వైపు ఇసుక మేటలు లేకపోయినా, నల్లమట్టి ఉన్నా మేటలు వేశాయని తప్పుడు రిపోర్టులతో ఈ అనుమతులు ఇస్తున్నారు. దీనివల్ల మూడు నుంచి ఐదు లక్షల క్యూసెక్కులలోపు వరద వస్తే లంక గ్రామాల్లోని పంటలు నీట మునుగుతాయి. ఈ ప్రాంతంలో 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పంటలకు నష్టం జరగదు. 7–8 లక్షల క్యూసెక్కుల వరద వస్తే లంక భూములు మునిగిపోతాయి. లంక భూముల్లో మట్టిని తొలగించడం వల్ల ఆ ప్రాంతంలో మట్టి కొట్టుకుపోయి లంక భూములు కనుమరుగవుతాయి.

ఎస్సీ, ఎస్టీ రైతులకు తీవ్ర అన్యాయం

చోడవరం, చిర్రావూరు, రామచంద్రాపురంలతోపాటు దుగ్గిరాల మండలంలోని పలు ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు సొసైటీ కింద భూములు కేటాయించారు. ఈ భూముల్లో పసుపు, కంద, మొక్కజొన్నలతోపాటు ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రెండుసార్లు పంటలు వేస్తారు. పంటలు వేసే సమయంలో రెండుమూడు సార్లు వరద వచ్చినా కొద్దిపాటి నష్టమే జరుగుతుంది. ఈ ఇసుక తవ్వకాల వల్ల పంటలు పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది.

పశుపోషణ కష్టం

ప్రభుత్వ, ప్రైవేటు లంక భూముల్లో పశువుల మీద ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. లంక భూ ముల్లో ఉన్న మట్టిని తొలగించడం వల్ల ఇసుక బయటపడి పచ్చిమేత కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే పోషణ సరిగా లేక పశువులు అంతరించిపోతున్నాయి. వ్యాపారుల స్వార్థ ప్రయోజనాల కోసం ఈ భూములను కూడా నాశనం చేస్తే పాడిపరిశ్రమ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లంక భూముల్లో తవ్వకాలు నిర్వహించడం వల్ల మా భూమి పూర్తిగా కృష్ణానదిలో కలిసి పోతుంది. ఈ మధ్యకాలంలో కృష్ణానదికి భారీగా వరదలు రావడంతో ఇప్పటి కే లంక భూములు విరిగిపోయి నదిలో కలిసి పోయాయి. ఈ తవ్వకాల వల్ల మరింత నష్టం కలుగుతుంది. లంక భూముల తవ్వకాలతోపాటు పక్కనే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. లేకుంటే రైతులకు ఆత్మహత్యే శరణ్యం.

–అయ్యప్పరెడ్డి, రామచంద్రాపురం

లంక భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తే గొర్రెలు, మేకలు, గేదెలు మేపుకునేవారు వలస వెళ్లాల్సిందే. చిర్రావూరుతోపాటు ఈ చుట్టు పక్కల ప్రాంతంలో ఐదు వేల గొర్రెలు, మేకలను లంక భూముల్లోనే మేపుకుంటున్నాం. లంక భూములు పోతే మా జీవితాలు కూడా తారుమారవుతాయి.

–యాదయ్య, గొర్రెల కాపరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement