అంతా నా ఇష్టం అంటున్న తూర్పు ఎమ్మెల్యే
నేడు గుంటూరు బి కన్వెన్షన్‌లో ప్రభుత్వ ఇఫ్తార్ విందా..?
జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి,
ఉపముఖ్యమంత్రుల చిత్రాలు ఎక్కడ?
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఇఫ్తార్ విందు టీడీపీలో దుమారాన్ని రేపుతోంది. తూర్పు ఎమ్మెల్యే గుంటూరు జిల్లాలో అంతా తానే చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆహ్వాన పత్రికలు పోస్ట్ చేయడంపై టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల కోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. ఆ నిధుల్లో గుంటూరు జిల్లాకు రూ.5 లక్షలు కేటాయించింది.
మరలా వాటిలో మార్పులు చేసి దానిని రూ.4 లక్షలు కేటాయించినట్లు తెలుస్తుంది. ప్రతి ఏటా ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇఫ్తార్ విందుకు కేటాయించిన నిధులను సొంత ఖర్చులకు వినియోగిస్తున్నట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పశ్చిమ ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ?
గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో సుమారు లక్ష మందికి పైగా ముస్లిం మైనారిటీల ఓట్లు ఉన్నాయి. అయితే గుంటూరు తూర్పు నియోజవర్గ శాసనసభ్యుడు తన సొంత ఖర్చులతో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసినట్లు ఆహ్వాన పత్రికలు వేయించడం చర్చనీయంశంగా మారింది. ఆహ్వానపత్రికలో ఎక్కడా పశ్చిమ ఎమ్మెల్యే చిత్రం లేకపోవడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని తూర్పు ఎమ్మెల్యే, పశ్చిమ ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించకుండానే పొన్నూరు రోడ్డులోని బి కన్వెన్షన్‌లో ఏర్పాటుచేయడం విశేషం. ఇఫ్తార్ విందు ఏర్పాట్లు తూర్పు ఎమ్మెల్యే ఒక్కరే పరిశీలించడం కూటమి నాయకులు జీర్ణించుకోక పోతున్నట్లు తెలుస్తుంది.
సోషల్ మీడియాలో చక్కర్లు..
తూర్పు ఎమ్మెల్యే చిత్రంతో ఇఫ్తార్ విందునకు మిమ్ములను ఆహ్వానిస్తున్నాం అంటూ కరపత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కరపత్రంపై ప్రభుత్వ లోగో, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫొటోలు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి చిత్రం కూడా లేకపోవడంపై టీడీపీ నాయకుల మధ్య చర్చనీయంశంగా మారింది. అసలు గుంటూరు తూర్పు, పశ్చిమ, మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ, తెనాలి నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మైనారిటీ నాయకుల ఫొటోలు కూడా లేకపోవడంపై కూటమి పార్టీలో ఇఫ్తార్ కీ దావత్‌పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ ఇఫ్తార్ విందు తూర్పు నియోజకవర్గ ముస్లింలకు మాత్రమేనా? పశ్చిమ నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న మిగిలిన ఐదు నియోజకవర్గాల ముస్లింలకు కూడానా అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది.


