గుంటూరు ఎడ్యుకేషన్: పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల పరీక్ష కేంద్రంలో శుక్రవారం సీనియర్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పరిశీలించారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అన్ని గదుల్లోకి వెళ్లి, విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్ష కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాటును పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు బస్సు సౌకర్యం, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ పటిష్టంగా అమలు చేసి, పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసి వేయించాలని ఆదేశించారు. జిల్లాలోని 87 కేంద్రాల్లో జరిగిన ఫిజిక్స్ పేపర్–2 పరీక్షకు కేటాయించిన 28,118 మంది విద్యార్థుల్లో 27,730 మంది హాజరయ్యారు.


