టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు నివాసంలో వాహనం
చెప్పు చూపుతున్న టీడీపీ నేత లంకా మాధవి
ఇంటి గోడలను సైతం కూల్చివేసిన టీడీపీ మూకలు
పచ్చ మూకల దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్
సాక్షి టాస్క్‌ఫోర్స్ : రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న తెలుగుదేశం నేతలు గుంటూరు నగరంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసానికి తెగబడ్డారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించి ఆరున్నర గంటలకు పైగా విధ్వంసం సృష్టించారు. ఇంత జరుగుతున్నా డీజీపీ నుంచి ఐజీ, ఎస్పీల వరకు ఒక్కరు కూడా అందుబాటులోకి రాలేదు. రెండు సార్లు శాసన సభ్యులుగా, మాజీ మంత్రిగా పనిచేసి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న అంబటికి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంబటి ఇంటితోపాటు, పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. ఒక దశలో అంబటిపై చేయి చేసుకున్నారు.
పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఆ దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. కోడిగుడ్లు, నాపరాళ్లు, బండరాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. టీడీపీ మూకలు ఫూటుగా మద్యం తాగి భయానక వాతావరణం సృష్టించాయి. ఒక దశలో పెద్ద దుంగలు తెచ్చి, అంబటి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టి వికృతానందం పొందారు. విద్యుత్ సరఫరా కట్ చేయించి మరీ దాడులు చేశారు. మూడు వ్యానులతో పాటు పదుల సంఖ్యలో జీపుల్లో వచ్చిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దిగ్బంధంలో ఉన్న అంబటి కార్యాలయంలో మళ్లీ రాత్రి పది గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద దుంగలు తెచ్చి కిటికీలు పగులగొట్టారు. నాపరాయి ముక్కలు, పెద్ద పెద్ద రాళ్లను పార్టీ కార్యాలయంపై విసిరారు. ఆరు గంటల విధ్వంసం అనంతరం పోలీసులు వజ్రా వాహనాన్ని తెచ్చి రాంబాబును అరెస్టు చేశారు.


