మధ్యవర్తిగా వచ్చి మృత్యువాత
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
● నరసరావుపేట మండలం
కేఎం అగ్రహారంలో ఘటన
● మధ్యవర్తిగా వచ్చి ప్రాణాలు
పోగొట్టుకున్న పర్వతాలు
● కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టిన పోలీసులు
నరసరావుపేట రూరల్: స్వల్పవివాదం నేపథ్యంలో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కేఎం అగ్రహారంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంటి పక్కన వారితో ఏర్పడిన వివాదం పరిష్కారంలో మధ్యవర్తిగా వెళ్లిన వ్యక్తి దాడిలో మృత్యవాత పడ్డాడు. నరసరావుపేట రూరల్ పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు. నరసరావుపేట మండలం కేఎం అగ్రహరానికి చెందిన ఓర్సు ముసలయ్య, వేముల వెంకటేశ్వర్లు పక్కపక్క ఇంటిలో నివసిస్తున్నారు. స్థలం విషయంలో గతంలో ఇరువురి మధ్య వివాదం ఉంది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పలు మార్లు స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వేముల వెంకటేశ్వర్లు కుమారుడు అంకారావు ద్విచక్రవాహనంపై గడ్డి తీసుకొస్తుండగా రోడ్డుపై నిలిపి ఉంచిన ముసలయ్యకు చెందిన ద్విచక్రవాహనానికి తగిలి బండి కింద పడింది. దీనిపై ముసలయ్య కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో అంకారావు రాడ్‌తో ముసలయ్యకు చెందిన ద్విచక్రవాహనానంపై దాడిచేయడంతో పాక్షికంగా దెబ్బతిన్నది.
మధ్యవర్తిగా వచ్చి..
ఇంటి వద్ద ఆదివారం జరిగిన వివాదాన్ని దేచవరంలో ఉంటున్న తన సోదరుడు పర్వతాలుకు ముసలయ్య తెలియజేశాడు. గ్రామానికి వచ్చి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. తన కుమారుడు హనుమంతరావుతో కలిసి పర్వతాలు అగ్రహారం వచ్చాడు. ముసలయ్య కుమారుడు కోటేశ్వరరావు, భార్య రమణలు, పర్వతాలు, హనుమంతరావులు నలుగురు రెండు ద్విచక్రవాహనాలపై వెంకటేశ్వర్లుకు చెందిన పొలం వద్దకు వెళ్లారు. అక్కడ వెంకటేశ్వర్లు ఆయన కుమారుడు అంకారావుతో వీరికి వాగ్వివాదం జరిగింది. వెంకటేశ్వర్లు, అంకారావులు గడ్డపార, కర్రలతో వీరిపై దాడి చేశారు. ఈ దాడిలో పర్వతాలు అక్కడికక్కడే మృతిచెందాడు. కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడటంతో ఏరియా వైద్యశాలకు తరలించారు. పర్వతాలు కుమారుడు హనుమంతురావుకు స్వల్పగాయాలయ్యాయి.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
దాడి జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ కిషోర్‌లు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. దాడికి ఉపయోగించిన గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌టీమ్ నమూనాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ సుబ్బారావు తెలిపారు.
మధ్యవర్తిగా వచ్చి మృత్యువాత


