నేటి నుంచి ఏఎన్‌యూలో యువజనోత్సవాలు
ఏఎన్‌యూ(పెదకాకాని): అంతర్ కళాశాలల యువజన ఉత్సవాలు సోమవారం నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రారంభం కానున్నాయి. వర్సిటీ కళాశాలలతోపాటు అనుబంధ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో పూర్తి సదుపాయాలు కల్పించి, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ ఆచార్య ఎస్.మురళీమోహనన్ తెలిపారు. సోమ, మంగళ, బుధవారాలలో మూడు రోజులపాటు మ్యూజిక్, డ్యాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు జరుగునున్నాయి. యువజన ఉత్సవాల నిర్వహణకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే యువజనోత్సవాలకు ముఖ్య అతిథులుగా వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా వర్సిటీ రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్, రిజిస్టార్ ఆచార్య సింహాచలం, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ ఎస్‌ఎస్.తమన్ హాజరుకానున్నారు. అతిథులుగా ఓ ఎస్‌డీ ఆచార్య ఆర్‌విఎస్‌ఎస్ రవికుమార్, పాలక మండల సభ్యులు ఆచార్య కె. సుమంత్‌కుమార్, ఆచార్య ఎం.జగదీష్ నాయక్, వివిధ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సురేష్‌కుమార్, ఆచార్య వీరయ్య, ఆచార్య పాల్‌కుమార్, ఆచార్య లింగరాజు, ఆచార్య దివ్య తేజమూర్తి తదితరులు హాజరు కానున్నట్లు యువజనోత్సవాల కో ఆర్డినేటర్ ఎస్. మురళీమోహన్ తెలిపారు.
● సుమారు రూ.6 లక్షలు టోకరా
● పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మహిళ
మంగళగిరి టౌన్: బ్యాంకుల్లో, వివిధ లోన్ యాప్‌లలో రుణాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళను మోసం చేసిన ఘటన మంగళగిరి పట్టణంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణం ఎల్‌జీ నగర్‌కు చెందిన రాజేశ్వరి వంట పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కొన్నినెలల క్రితం పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ఏపీఎస్పీ గేటు సమీపంలో ఓ షాపు పెట్టుకుని వ్యాపారం నిర్వహిస్తోంది. 2024 సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో చరణ్‌రెడ్డి ఆమె షాపునకు వచ్చి తరచూ చీరలు కొనేవాడు. ఆ విధంగా రాజేశ్వరికి పరిచయమయ్యాడు. చీరల వ్యాపారం అభివృద్ధికై లోన్లు ఇప్పిస్తానని రాజేశ్వరిని నమ్మించాడు. పాన్‌కార్డు, ఆధార్ కార్డు కావాలని, అప్పుడప్పుడు మహిళ ఫోన్ కూడా ఇవ్వాల్సి వస్తుందని చరణ్‌రెడ్డి చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోవడంతో గత సంవత్సరం ఆగష్టు 15వ తేదీన గుంటూరులోని హర్షిత ఎంటర్‌ప్రైజెస్‌కు సదరు మహిళను తీసుకువెళ్లి లోన్ ఇప్పిస్తానని చెప్పి ఆధార్, పాన్‌కార్డు చెక్ చేయించి మహిళ చేతి వేలిముద్రలు తీసుకున్నాడు. ఈ క్రమంలో హర్షిత ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులు రూ.3 లక్షల లోన్ సరిపోతుందా అని ప్రశ్నిస్తూ ఫొటోలు కూడా తీసుకున్నారు. వాళ్లు ఏం అడిగినా మాట్లాడద్దని రాజేశ్వరికి చెప్పడంతో మౌనంగా ఉంది. అదే సంవత్సరం సెప్టెంబర్ 11న గుంటూరులోని సత్య షోరూమ్‌కు తీసుకువెళ్లి అంతకుముందు లోన్ ఫెయిల్ అయ్యిందని, మళ్లీ ప్రయత్నం చేస్తున్నానంటూ నమ్మబలికాడు. అక్కడ కూడా రాజేశ్వరి వేలముద్రలు వేయించి, ఆధార్, పాన్ వెరిఫికేషన్ అంటూ మాయమాటలు చెప్పాడు. మరల లోన్ ఫెయిల్ అయిందని, నీ ఫోన్ కావాలంటూ చెప్పడంతో ఫోన్‌ను చరణ్‌రెడ్డికి రాజేశ్వరి ఇచ్చింది. అలా 10 రోజుల తరువాత మంగళగిరిలోని మహిళ షాప్‌కు వచ్చి గంటలు గంటలు రాజేశ్వరి ఫోన్ తీసుకుని చూసేవాడు. వచ్చిన కస్టమర్లకు చీరలు చూపిస్తూ ఫోన్ గురించి పట్టించుకోకపోవడంతో రాజేశ్వరి ఫోన్‌లో లోన్ యాప్‌లు వేశాడు. 2024 అక్టోబర్ 5వ తేదీన ఒక లోన్ యాప్ వేసి పూర్తిచేయమని చెప్పి వెళ్లిపోయాడు. ఆ యాప్‌లో సమాచారం ప్రకారం పూర్తిచేసింది రాజేశ్వరి. సాయంత్రానికి తన ఖాతాలో నుండి రూ.17 వేల మాయమైనట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే చరణ్‌రెడ్డికి రాజేశ్వరి ఫోన్ చేసి ఖాతాలో డబ్బులు పోయాయని, ఎందుకు అని అడిగితే షాప్‌కు వస్తానని చెప్పి వచ్చాడు. చరణ్‌రెడ్డి మహిళ ఫోన్ తీసుకుని కొద్ది సమయం ఫోన్‌లో ఏదేదో చేస్తూ మీ నగదు ఎక్కడికీ పోలేదు. నేను ఆ యాప్‌లో రిపోర్ట్ చేశాను, తిరిగి నీ ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయని నమ్మబలికాడు. అదేవిధంగా పలుమార్లు ఆమె ఖాతా నుంచి నగదు తీసుకున్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో శనివారం రాత్రి రాజేశ్వరి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


