వైకుంఠపురవాసుని అనుగ్రహంతో ఉన్నత స్థానం
● నటుడిగా జన్మ సార్థకం
● బొల్లిముంత పురస్కారం..
పూర్వజన్మసుకృతం
● ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం
తెనాలిటౌన్: నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు బొల్లిముంత శివరామకృష్ణ తెలుగు సినిమాలకు రాసిన మాటలు, పాటలు ఆ రోజుల్లో సమాజంపై ఎంతో ప్రభావం చూపాయని, ఆయన పేరిట పురస్కారం అందుకోవటం తన పూర్వజన్మసుకృతమని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం అన్నారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరిగిన రెండురోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవంలో చివరిరోజైన ఆదివారం రాత్రి ఏర్పాటైన సభకు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో సినీనటుడు బ్రహ్మానందకు బొల్లిముంత శివరామకృష్ణ జాతీయస్థాయి జీవితకాల పురస్కారాన్ని రూ.లక్ష నగదుతో బహూకరించారు. అనంతరం బ్రహ్మానందం తన కృతజ్ఞతాపూర్వక ప్రసంగంలో, తెనాలితో తనకు ఎంతగానో అనుబంధం ఉందన్నారు. వైకుంఠపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్రహంతోనే తానీ స్థాయికి ఎదిగానని చెప్పారు. నలభై తొమ్మిదేళ్ల కిందట డిసెంబరు 14న తన వివాహం వైకుంఠపురం దేవస్థానంలో నిరాడంబరంగా జరిగిందని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తాను పేదరికంలో ఉన్నానని చెప్పుకున్నారు. ఇక్కడకు వచ్చే ముందు వైకుంఠపురం దేవస్థానం వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్టు తెలిపారు. తెనాలిలో జరిగే శ్రీరామనవమి వేడుకలు గొప్పగా ఉండేవనీ, ఆకాశమంత పందిళ్లు, మార్కెట్లోని దొంగరాముడి గుడి వద్ద పానకం, వడపప్పు తిన్న రోజులు మరచిపోలేనని చెప్పారు. సినిమాల్లో తనను చూడగానే జనం నవ్వుకోవటం దేవుడు ప్రసాదించిన వరంగా భావిస్తానని, నటుడిగా తన జన్మ సార్థకమైందని బ్రహ్మానందం అన్నారు. మంచిగా ఆలోచించి, పదిమందికీ మంచిచేయాలన్నారు. ధర్మం, సహాయం అనే పదాలు తనకు ఇష్టం ఉండదని ఏ సహాయం చేసినా గోప్యంగా ఉంచాలనేది తన భావనగా చెబుతూ ఆ సహాయం కూడా యోగ్యులకు చేయాలని సూచించారు. మనుషులంతా ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలనేది తన ఆకాంక్షగా చెప్పారు. ఏపీ నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ పేద కళాకారులకు ఆర్థికసహకారం అందించటంలో బ్రహ్మానందం ముందువరుసలో ఉంటారని, చేసిన సాయం ఎవరికీ చెప్పుకోరని అన్నారు. ఆయనొక ప్రొఫెసర్, ఫిలాసఫర్‌గా అభివర్ణించారు. డాక్టర్ ఆలపాటి కృష్ణసందీప్, తుమ్మల కిషోర్‌బాబు, చందు శ్రీనివాసరావు, అరవ రామకృష్ణ, బి.శ్రీనివాసరావు, సింగరాయకొండ మండల విద్యాధికారి బొల్లిముంత అజయ్‌కుమార్, బొల్లిముంత కృష్ణ, కనపర్తి బెన్‌హర్ మాట్లాడారు. సభలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, సామాజిక కార్యకర్త చెరుకూరి రమేష్‌బాబు, అంతర్జాతీయ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలను సత్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చందు సుబ్బారావు పర్యవేక్షించారు.
వైకుంఠపురవాసుని అనుగ్రహంతో ఉన్నత స్థానం


