చోరీ కేసులో నిందితులు అరెస్టు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాతగుంటూరు పీఎస్ సీఐ వెంకటప్రసాద్, ఎస్‌ఐ రెహమాన్ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈఏడాది ఆగస్టు 9న వాసవి కాంప్లెక్సు సమీపంలో రెడ్లబజారులో నివాసం ఉండే మద్రాసు సరస్వతి పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి అదే నెల 10వ తేదీ రాత్రి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి లోపలకు వెళ్లి చూడగా, రూ. 10 లక్షల నగదు, 90 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో భాగంగా పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన మద్దు అనిత తన భర్తతో విడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా పాతగుంటూరు యాదవబజారుకు చెందిన షేక్ కరీముల్లా, శ్రీనగర్‌కు చెందిన రెడ్డి సాయిసంతోష్, అరండల్‌పేట పిచుకులగుంట ప్రాంతానికి చెందిన గండికోట గోపి, శ్రీనగర్‌కు చెందిన బాణావత్ చందునాయక్‌లతో కలిసి చోరీ చేసేందుకు పథకం పన్నారు. బాధితురాలు ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీ, తదితర ఆధారాలతో నిందితురాలు అనితను అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో, మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరికి గురైన రూ. 10 లక్షలు నగదుకు సంబంధించి రూ. 3.50 లక్షలు స్వాధీనం చేసుకోగా, దొంగిలించిన బంగారాన్ని మేడికొండూరు యూనియన్ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్‌లలో తాకట్టు పెట్టిన స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సిబ్బంది నూరుద్దీన్, మోహన్, రామారావులను అభినందించారు.


