అనాథ ఆశ్రమ పిల్లలకు అమృత హెల్త్ స్కీం
రూ.10 లక్షల విలువైన బయో ఉత్పత్తులు సీజ్ సత్తెనపల్లి: సత్తెనపల్లిలోని శ్రీ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రంలో అనధికారికంగా నిల్వ ఉంచిన బయో ఉత్పత్తులను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా సోమవారం పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రం దుకాణంలో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.10 లక్షల విలువైన బయో ఉత్పత్తులను సీజ్ చేసి, 6ఏ కేసు నమోదు చేశారు. అచ్చంపేట రోడ్డులోని నయనికరాజు ఎరువుల దుకాణంలో రూ.9.47 విలువైన ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేశారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ కె.చంద్రశేఖర్, సీహెచ్. ఆదినారాయణ, సత్తెనపల్లి ఏడీఏ బి.రవిబాబు, సత్తెనపల్లి ఏవో బి.సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్, విత్తన చట్టాల జీఓ ప్రతులు దహనం నకరికల్లు: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన విత్తన, విద్యుత్ చట్టాల వల్ల రైతులు, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారని కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.పిచ్చారావు మండిపడ్డారు. విత్తన, విద్యుత్ చట్టాలకు సంబంధించిన జీఓ ప్రతులను చేజర్ల గ్రామంలో సోమవారం దహనం చేసి నిరసన తెలిపారు. రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉన్న చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈవూరి అప్పిరెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, చట్టు కోటేశ్వరరావు, కొండానాయక్, ఈవూరి వెంకటేశ్వరరెడ్డి, ఈవూరి శ్రీనివాసరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.
వినాయకునికి సంకటహర చతుర్థి పూజలు
అమరావతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరాలయంలో గల విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో సోమవారం సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జాగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు, గరికెతో విశేషాలంకారం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్లను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
హెల్త్ కార్డులు పంపిణీ చేసిన కలెక్టర్
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ గుర్తింపు పొందిన అనాథాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ పిల్లల సంక్షేమం దృష్ట్యా ఎన్టీఆర్ వైద్యసేవ, అమృత హెల్త్ స్కీంను అమలు చేస్తామని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం హెల్త్ కార్డులను చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన 39 మంది చిన్నారులకు ప్రత్యేక అమృత హెల్త్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు.
స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో మరణాలు సంభవించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖను సమన్వయం చేసుకుంటూ పంచాయతీ, రెవెన్యూ శాఖలు ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని తెలిపారు. ఈ జ్వరాలకు ఉపయోగించే మందులు ఉప ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
1/2
అనాథ ఆశ్రమ పిల్లలకు అమృత హెల్త్ స్కీం
2/2
అనాథ ఆశ్రమ పిల్లలకు అమృత హెల్త్ స్కీం