ముగిసిన ఏఐఎఫ్‌టీయూ (న్యూ) రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: గుంటూరు నగరంలో జరుగుతున్న రాష్ట్ర ఏఐఎఫ్‌టీయూ (న్యూ) రాష్ట్ర మహాసభలలో భాగంగా అరండల్ పేట వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన ప్రతినిధుల సభ మంగళవారం విజయవంతంగా జరిగింది. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పాండా, రైల్వే కార్మిక నాయకుడు వీరయ్య, చేనేత కార్మిక నాయకుడు వెంకట్రావు సభకు అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్‌బాబు, రాష్ట్ర కోశాధికారి డీవీఎన్ స్వామి, రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఎంఎస్ శాంతి, అప్పారావు స్టీరింగ్ కమిటీగా వ్యవహరించారు. సభలో సంస్థ జాతీయ కార్యదర్శి పీకే షాహి మాట్లాడుతూ వేతనాల పెంపు కోసం, శ్రమ దోపిడీని అంతం, కార్మిక వర్గంలో రాజకీయ చైతన్యాన్ని కల్పించడానికి ఏఐఎఫ్‌టీయూ (న్యూ( కృషి చేస్తుందన్నారు. తెలియజేశారు. సీ్త్ర విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షురాలు సి.విజయ, పీడీఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జన సాహితి రాష్ట్ర అధ్యక్షుడు దివి కుమార్ తదితరులు సభలో మాట్లాడారు. అనంతరం సంస్థ రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌బాబు ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికను చర్చించిన అనంతరం మహాసభ ఆమోదించింది. గణేష్ పాండా అధ్యక్షుడిగా, కిషోర్ బాబు కార్యదర్శిగా, డీవీఎన్ స్వామి కోశాధికారిగా వివిధ జిల్లాల నుంచి మరో 9 మంది కార్యవర్గ సభ్యులతో నూతన కమిటీని మహాసభ ఎన్నుకుంది. సభలో వివిధ రంగాలు, వివిధ ప్రాంతాల కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్లాంటేషన్ వాచర్లను క్రమబద్ధీకరించాలి
మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ప్లాంటేషన్ వాచర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని వాచర్ల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మంగళగిరి ఆటోనగర్‌లోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ అటవీ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి. శ్రీధర్‌కు వాచర్ల సంఘాలు వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అంకయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2016లో యూనియన్లతో కూడిన ఒప్పందం మేరకు 7 సంవత్సరాలు సేవ పూర్తిచేసిన వాచర్లను 2019 వరకు క్రమబద్ధీకరించినప్పటికీ అనంతరం ఈ ప్రక్రియ నిలిచిపోయిందని వెల్లడించారు. ప్రస్తుతం క్రమబద్దీకరించిన వాచర్లు నెలకు రూ. 27546/–లు వేతనం పొందుతున్నప్పటికీ తాత్కాలిక వాచర్లకు మాత్రం రోజుకు కేవలం రూ. 597/–లు మాత్రమే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఎలాంటి తేడా లేకున్నప్పటికీ వేతనాల్లో ఉన్న అసమానతలు తొలగించి సమాన ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి యామల మధు, తదితరులు ఉన్నారు.
మార్షల్ ఆర్ట్స్‌లో జాన్‌సైదాకు సిల్వర్ మెడల్
ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు జెడ్పీ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి పి.జాన్‌సైదా తాంగ్‌తా మార్షల్ ఆర్ట్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించినట్లు పాఠశాల హెచ్‌ఎం ఎల్.సాంబయ్య తెలిపారు. పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి జాన్‌సైదాను అభినందించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6,7 తేదీల్లో అనకాపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తాంగ్‌తా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జాన్‌సైదా సిల్వర్ మెడల్ సాధించాడన్నారు. విద్యార్థి, పీడీ సుజాతను ఉపాధ్యాయులు అభినందించారు.
జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ బలోపేతం
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: జిల్లాలో క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకై విసృతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రజా భద్రతను పెంపొందించేందుకు, నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు ప్రతి రోజు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రధాన కూడళ్లల్లో నిఘా నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రధాన కూడళ్లు, వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులు, బ్యాంక్‌లు, పాఠశాలలు, కళాశాలలు, జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో గస్తీ కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లల్లో అనుమానిత వ్యక్తులను గుర్తించడం, చోరీలు, అక్రమ కార్యకలాపాలు జరుగకుండా నిరంతరం తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకై జిల్లాలోని ప్రధాన రహదారులు, కూడళ్లల్లో పోలీస్ బృందాలు విధుల్లో ఉంటున్నాయని, ప్రమాదాలు వాటిల్లకుండా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని రౌడీషీటర్లు, గంజాయి కేసుల నిందితులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు.
రూ.12.28 లక్షల బయో ఉత్పత్తులు స్వాధీనం
నరసరావుపేట రూరల్: తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.12,28,740 విలువైన బయో ఉత్పత్తులు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన విజిలెన్స్ అధికారులు పట్టణంలోని పార్సిల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న వివిధ కంపెనీల బయో ఉత్పత్తులను నిలుపుదల చేశారు. వ్యాపారులు అందజేసిన బిల్లులు, అనుమతి పత్రాలను పరిశీలించిన అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ నుంచి బయో ఉత్పత్తులు రవాణా చేస్తున్నట్టు నిర్దారించారు. ఈ మేరకు రూ.12లక్షల విలువైన 188.8లీటర్ల ఆరు రకాల బయో ఉత్పత్తులను వ్యవసాయ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏవో సీహెచ్ ఆదినారాయణ, సీఐ కె.చంద్రశేఖర్, నరసరావుపేట ఏవో ఐ.శాంతి పాల్గొన్నారు.
ముగిసిన ఏఐఎఫ్‌టీయూ (న్యూ) రాష్ట్ర మహాసభలు
ముగిసిన ఏఐఎఫ్‌టీయూ (న్యూ) రాష్ట్ర మహాసభలు


