● కాలువలోనుంచి బయటకు తీసి వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని
సీతానగరంలో రోడ్డుపై మృతదేహం
తాడేపల్లి రూరల్: సీతానగరం బకింగ్‌హామ్ కెనాల్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కనే మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వదిలి వెళ్లిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్ నుంచి ఎన్‌టీఆర్ కరకట్టకు వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జి వద్ద గోడపక్కనే ఒక మృతదేహం ఉంది. దీంతో ఆ మృతదేహాన్ని నీటిలోనుంచి తీసి బయట పెట్టినట్లు స్థానికులు గుర్తించారు. మృతుని శరీరంపై కేవలం అండర్‌వేర్ మాత్రమే ఉంది. బకింగ్‌హామ్ కెనాల్‌లో మృతదేహం కొట్టుకుని వస్తే ఆ మృతదేహాన్ని ఎవరైనా తీసిఅక్కడ వదిలి వెళ్లారా? లేదా ఏదైనా ఘర్షణ జరిగి నీటిలో ముంచి చంపి అక్కడ వదిలి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటిలో కొట్టుకు వచ్చిన మృతదేహాలను సహజంగా ఎవరూ బయటకు తీయరు. అలాంటిది ఈ మృతదేహాన్ని ఎక్కడ నుంచి అయినా తీసుకువచ్చి ఇక్కడ పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి శరీరంపై దుస్తులు తొలగించి ఈతకు వచ్చినట్లు చిత్రీకరించి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మధ్యకాలంలో సీతానగరం పుష్కర ఘాట్‌లో సీతానగరం, ప్రకాశం బ్యారేజ్ ప్రాంతాల్లో గంజాయి మత్తులో యువకులు తిరుగుతూ పలువుర్ని బెదిరించి డబ్బులు లాక్కు వెళ్లారు. ఇలాంటి వారు ఎవరైనా అతన్ని చంపి దుస్తులు లేకుండా నీటిలో ముంచి చంపి బయట పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని.. ఎవరైనా ఈ మృతుడిని గుర్తిస్తే 08645272186 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెనాలిలో స్క్రబ్ టైఫస్ తొలి కేసు
తెనాలి అర్బన్: తెనాలిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు కావటం కలకలం రేపింది. రూరల్ మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన యాభై ఏళ్ల మహిళకు చర్మంపై మచ్చ కనిపించటం, జ్వరంగా ఉండటతో వైద్యం కోసమని మంగళవారం మధ్యాహ్నం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు స్క్రబ్ టైఫస్ కేసుగా అనుమానించారు. సంబంధిత పరీక్ష కిట్లు ఆసుపత్రిలో లేకపోవటంతో బయటనుంచి కొనుగోలు చేసి తెప్పించారు. ఆ కిట్‌తో పరీక్ష చేయగా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స చేస్తున్నారు.


