నిర్మల మనసుతో సేవానిరతి
మృతిచెందిన తన భార్య డాక్టర్ నిర్మల పేరిట పలు కార్యక్రమాలు
గుంటూరు జీజీహెచ్,
వైద్య కళాశాలలో అభివృద్ధి పనులు
రూ.2 కోట్లతో పేదల ఆస్పత్రిలో అభివృద్ధి
రూ.15 కోట్లతో ఆమె పేరుతో భవనం కట్టించేందుకు సిద్ధం
దాత రాజాకర్ణంకు కలెక్టర్ అభినందనలు
గుంటూరు మెడికల్: భార్య, భర్త ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు.. జిల్లా విడిచి అమెరికా వెళ్లా రు. వైద్య వృత్తిలో ఆమె బిజీగా ఉండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన రాణించాడు. సుమారు 45 ఏళ్లకు పైగా భార్యభర్తలు ఇద్దరు తమ తమ రంగాల్లో రాణించి, కష్టపడి సంపాదించారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇరువురూ ఏడు పదుల వయ సుకు చేరుకున్నారు. ఈక్రమంలో హఠాత్తుగా భార్య మృతి చెందింది. భార్య జ్ఞాపకాలతో అమెరికాలో ఉండలేక ఆమె మృతిచెందిన మూడేళ్లకు ఇండియాకు వచ్చేశారు. ఇక్కడకు వచ్చిందే తడవుగా తన భార్య చది విన మెడికల్ కళాశాలకు, జీజీహెచ్‌కు ఏదొకటి చేయా లని తలంచారు. సుమారు మూడు నెలలుకు పైగా గుంటూరు జీజీహెచ్‌లో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కాట్రపాడుకు చెందిన రాజా కర్ణం.
భార్యపై ప్రేమతో....
రాజాకర్ణం భార్య డాక్టర్ నిర్మల వై.కర్ణం అమెరికాలో మానసిక వైద్య నిపుణురాలిగా విశేషమైన సేవలందిస్తూ మూడేళ్ల క్రితం మృతిచెందారు. భార్య మరణంతో మూడు నెలల క్రితం రాజా కర్ణం గుంటూరు జిల్లాకు వచ్చారు. తన భార్య చదువుకున్న గుంటూరు వైద్య కళాశాలలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఆరు ఏర్పాటు చేయించారు. అనంతరం గుంటూరు జీజీహెచ్‌లో మరో ఆరు ఆర్వో వాటర్ కూలింగ్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసి రోగులకు మంచినీరు, సురక్షిత చల్లటి నీరు తాగేందుకు అవకాశం కల్పించారు. సుమారు రూ.80లక్షలతో వైద్య కళాశాల, ఆస్పత్రిలో ఆర్వో ప్లాంట్స్‌ను నిర్మించారు. తదుపరి శుశ్రుత విగ్రహాన్ని జీజీహెచ్ ఓపీ విభాగం వద్ద ఏర్పాటు చేయించారు. ఇటీవల యాంపీ థియేటర్ నిర్మాణం ఆస్పత్రిలో చేపట్టారు. తన భార్య పేరుతో ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణం చేపట్టిన రాజాకర్ణంను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. డాక్టర్ పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్‌కు రూ.50లక్షలు, మాతా, శిశు సంరక్షణ వైద్య విభాగానికి(ఎంసిహెచ్) రూ.కోటి విరాళం ఇచ్చారు. జీజీహెచ్‌కు అనుబంధంగా బొంగరాల బీడులో ప్రభుత్వం కేటాయించిన ఆరు ఎకరాల స్థలంలో సుమారు రూ.15 కోట్లతో తన భార్య పేరుమీదుగా సైకియాట్రీ బ్లాక్ నిర్మాణం చేసేందుకు ముందుకొచ్చారు. చనిపోయిన భార్య పేరు మీదుగా 70 పదుల వయస్సు దాటిన రాజా కర్ణం మూడు నెలలుగా జీజీహెచ్‌లో చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఎంతో మంది ఆయన్ను అభినందిస్తున్నారు.
నిర్మల మనసుతో సేవానిరతి
నిర్మల మనసుతో సేవానిరతి


