అధికారుల తీరుపై ఎమ్మెల్యే గరం గరం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారుల తీరుపై మరోసారి నిరసన గళం విప్పారు. ప్రజలు అడిగే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలోనూ అధికారులు విఫలం అవుతున్నారని, దీని వల్ల నియోజకవర్గంలో ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. గతంలో జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తుపాను ఫాన్ కారణంగా నగరంలో ప్రభుత్వం సాయం అందించే కార్యక్రమాలను కనీసం సమాచారం ఇవ్వకుండానే కమిషనర్, మేయర్ ప్రొగ్రాం డిజైన్ చేయడంపై మండిపడ్డారు. దీనిని ఖండిస్తూ ఎమ్మెల్యే గల్లా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అధికారులను, మేయర్ తీరును కడిగి పారేశారు. రేషన్ డీలర్ల ఆక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా గుంతల రోడ్డుకు ప్యాచ్ వేసి మరోసారి అధికారుల తీరును ఎండగట్టారు.
పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వానం
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు ఉన్నారో.. ఏ పని చేస్తున్నారో తెలియడం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నా కనీసం తట్ట మట్టి కూడా వెయ్యకపోవడం సిగ్గుచేటని తెలిపారు. స్వయంగా తానే నియోజకవర్గంలో బైక్‌పై తిరిగి రోడ్ల అధ్వాన పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్థితిపై ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్ అనేక సమీక్షలు నిర్వహించినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని తెలిపారు. తన ఇంటి ముందే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సొంత నిధులతో రోడ్డుపై గుంతలు పూడుస్తానని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు నియోజకవర్గ అభివృద్ధిలో ఫెయిల్ అయ్యారని ఆమె ఆరోపించారు.


