ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
తెనాలి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండలంలోని అంగలకుదురు జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లో ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్రగ్స్‌కు, బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో విద్యార్థినుల కోసం 20 బయో టాయిలెట్లను నిర్మించేందుకు నెస్లె కంపెనీ ముందుకు వచ్చిందని చెప్పారు. తెనాలిలోని పారిశ్రమికవేత్తలు బడుల ప్రగతికి సహకరించాలని కోరారు. గుంటూరు, బాపట్ల, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ బియ్యాన్ని సేకరించి మధ్యాహ్న భోజనానికి పాఠశాలలు, వసతి గృహాలకు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో 1,049 పాఠశాలలు సహా జూనియర్ కళాశాలల్లో ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్, క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థుల చదువుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఉపాధ్యాయులు విభిన్న బోధనా పద్ధతులు వినియోగించాలని సూచించారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీయడం అవసరమన్నారు. డీఈవో సీవీ రేణుక, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్. అనూరాధ, పలువురు విద్యార్థులు, తలిదండ్రులు మాట్లాడారు. గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, డీవైఈవో శాంతకుమారి, ఎంఈవోలు మేకల లక్ష్మీనారాయణ, వి.జయంతిబాబు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఎంపీడీవో ఎ.దీప్తి, ఇతర అధికారులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో రూ.38.68 లక్షలతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్, లైబ్రరీ నూతన భవనాన్ని మంత్రి, అధికారులు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
మంత్రి నాదెండ్ల మనోహర్


