21న ‘పల్స్ పోలియో’ కార్యక్రమం
గుంటూరు వెస్ట్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వివిధ కూడళ్లలో శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగేలా ప్రచార పోస్టర్లు. కరపత్రాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్‌తోపాటు అధికారులు పల్స్‌పోలియో ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.
మార్గదర్శకాల ప్రకారం జాబితా
నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం అభ్యర్థుల జాబితాను రూపొందించాలని
జిల్లా కలెక్టర్ చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో వివిధ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు వైద్య ఆరోగ్యశాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు.
ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధం కావాలి
రెండవ విడత ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో రెండవ విడత ల్యాండ్ పూలింగ్‌పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించిందని గుర్తుచేశారు. దానికనుగుణంగా భూ సమీకరణ జరుగుతుందని అన్నారు. గ్రామ సభలు నిర్వహించేందుకు ముందుగా తేదీలను తెలియజేయాలని సూచించారు. వక్ఫ్ భూములను పరిరక్షించాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా


