ప్రకృతి వ్యవసాయంతో పంట వైవిధ్యతను పాటించాలి
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్) : ప్రకృతి వ్యవసాయం చేసి, పంట వైవిధ్యతను పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం.పద్మావతి అన్నారు. ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కృషిభవన్‌లో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఐదు రోజుల శిక్షణ సదస్సును జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం.పద్మావతి, జిల్లా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ పీడీ జి.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగు చేస్తున్న పంటల పద్ధతులపై సిబ్బంది అవగాహనతో పని చేయాలని అన్నారు. రసాయన పద్ధతులు పాటిస్తున్న రైతుల్లో కూడా ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగించాలని సూచించారు. ఆత్మ పీడీ జి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం, యూరియా వినియోగాన్ని తగ్గించే దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. త్వరలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా సందర్శిస్తానని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్రాంత ఐఏఎస్‌లు విజయ్‌కుమార్, రాయుడు వీసీ ద్వారా మాట్లాడారు. సదస్సులో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


