తగ్గిన ఏసీబీ దూకుడు | - | Sakshi
Sakshi News home page

తగ్గిన ఏసీబీ దూకుడు

Dec 4 2025 8:37 AM | Updated on Dec 4 2025 8:37 AM

తగ్గిన ఏసీబీ దూకుడు

తగ్గిన ఏసీబీ దూకుడు

తగ్గిన ఏసీబీ దూకుడు

ఏళ్లు గడిచినా డీఎస్పీల నియామకాలు లేవు టోల్‌ఫ్రీ నంబర్‌కు కొరవడిన ప్రచారం చంద్రబాబు సర్కారు వచ్చాక అవినీతిపై ఉదాసీనత

మారిన టోల్‌ఫ్రీ నంబర్‌..

నగరపాలెం (గుంటూరు వెస్ట్‌): ఉమ్మడి గుంటూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు తగ్గింది. అవినీతి అధికారులకు ముచ్చెమటలు పట్టించాల్సిన విభాగం ఇప్పుడు మౌనంగా వ్యవహరిస్తోంది. డీఎస్పీలను నియమించకపోవడం, ఐదేళ్లు, రెండేళ్లకుపైగా కొందరు సీఐలు తిష్టవేసి ఉండటం.. కిందిస్థాయి సిబ్బంది ఎనిమిదేళ్లుగా పాతుకుపోవడంతో నిస్తేజంగా మారింది. ఈ రెండేళ్లల్లో ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి అధికారులు తక్కువే. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్‌ శాఖకు అనుబంధమైన విభాగాల్లో సమూల మార్పులు చేపట్టారు. గుంటూరు ఏసీబీలో మాత్రం ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్‌ అన్నట్టుగా వ్యవహారం ఉంది.

జూలైలోనే ముగ్గురు..

జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఏసీబీ అధికారులు ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో జిల్లాల విభజన జరిగాక ఏసీబీ చాలా దూకుడుగా వ్యవహరించింది. ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శక వ్యవస్థ రూపొందించాలనే ఏకై క లక్ష్యంతో అడుగులేసింది. ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 అందుబాటులోకి తీసుకొచ్చారు. 2023 జూలైలో ఇరవై రోజుల్లో ముగ్గురు అధికారులపై ఏసీబీ దాడులు చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. రూ.60 వేలు, రూ.40 వేలు లంచాలు తీసుకుంటూ దొరికిన అధికారులు ఉన్నారు.

అధికారులు ఎక్కడ?

ఇక ఏసీబీని అధికారులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. 2024 ఎన్నికలకు రెండు నెలలు ముందు డీఎస్పీని బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఆయన స్థానంలో వేరే వారిని నియమించలేదు. ఇక్కడ ఇద్దరు డీఎస్పీలు ఉండాల్సినా ప్రస్తుతం ఒక్కరినీ నియమించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ సీఐని బదిలీ చేశారు. దీంతో వారి మార్క్‌ రాజకీయాన్ని ప్రదర్శించారు. తర్వాత మరో సీఐపై బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం నలుగురు సీఐలు ఉన్నారు. వారిలో నాలుగేళ్లుగా కొనసాగే వారు లేకపోలేదు. ఏఎస్‌ఐలు మొదలు కానిస్టేబుళ్ల వరకు ఏళ్ల తరబడిగా తిష్ట వేశారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికార/ సిబ్బంది సరిపోతారని, అదనపు నియమకాలు అవసరంలేదని కార్యాలయపు వర్గాలు పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది. నియమాకాలపై ఉన్నత స్థాయిలో ప్రతిపాదనలు పంపించినా స్పందన లేదు.

పెరిగిన పని భారం

ఏసీబీలో పనుల భారం ఎక్కువైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి కార్యాలయపు ఉన్నతాధికారులు ప్రధాన కార్యాలయం (హెడ్‌ ఆఫీస్‌) వైపు చక్కర్లు కొడుతున్నారు. ఎవరైనా ఫోన్‌ కాల్‌ చేస్తే హెడ్‌ ఆఫీస్‌లో ఉన్నామని చెబుతున్నారు. సిట్‌, ఇతరత్రా వాటిల్లో విచారణకు సంబంధించి క్షణం తీరికలేకుండా ఉంటున్నామని వాపోతున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏసీబీ చతికిల పడింది. గత ప్రభుత్వంలో ఉన్న దూకుడుతనం ప్రస్తుతం కానరావడం లేదు. పెద్ద మొత్తంలో లంచాలు అడిగారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలనే నిబంధన అమల్లోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌ చివర్లో రేపల్లె డివిజన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి వెంకటరమణ రూ.1.25 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అయితే లంచాల్లోనూ చిన్న, పెద్ద తేడాలు స్పష్టిస్తే కింది స్థాయిలో న్యాయం జరుగుతుందా అనే అనుమానం బాధితుల నుంచి వ్యక్తమవుతుంది. గతంలో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌ 14400ను తొలగించారు. అవినీతిని నిర్మూలిద్దాం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామంటూ 1064 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నంబర్‌పై ఉమ్మడి జిల్లాలోని ప్రజల్లో అవగాహన కొరవడింది. బాధితులు సైతం ఏ నంబర్‌కు ఫోన్‌ చేయాలనేది అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఏసీబీ సైతం లంచంపై పెద్దగా అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement