
మెలోడియోసిస్ రోగికి విజయవంతంగా చికిత్స
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు నెలలకుపైగా అందరిని ఆందోళనకు గురిచేస్తున్న మెలోడియోసిస్ వ్యాధి బాధితునికి గుంటూరు జీజీహెచ్ వైద్యులు రెండు నెలలపాటు వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలేనికి చెందిన పి.ఎలీషా (42) ఆగస్టు 21న అడ్మిట్ అయ్యారన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. మెలోడియోసిస్ ఉందని నిర్ధారించామని, రెండు నెలలపాటు వైద్యం అందించి వ్యాధి నుంచి విముక్తుడిని చేశామన్నారు. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి.ఉషారాణి మాట్లాడుతూ ఈ విషయంలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ బృందం, జనరల్ సర్జరీ విభాగం సహకారం అందించారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ సి.వాసవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ప్రభాకర్, పీజీ వైద్యులు డాక్టర్ కే ఆశాజ్యోతి, డాక్టర్ వి.స్వర్ణ సేవలు అందించినట్లు చెప్పారు.