సైబర్‌ కేటుగాడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ కేటుగాడు అరెస్టు

Oct 15 2025 5:58 AM | Updated on Oct 15 2025 5:58 AM

సైబర్‌ కేటుగాడు అరెస్టు

సైబర్‌ కేటుగాడు అరెస్టు

ఎఫ్‌బీలో ఫ్రెండ్‌ రిక్వెస్టులు, మెసేజ్‌లతో అమాయకులకు బురిడీ

ఆపై అసభ్యకరంగా చాటింగ్‌ చేస్తున్నారని పేర్కొంటూ బెదిరింపులు

కాల్‌బాయ్‌గా అవకాశం అంటూ సైబర్‌ నేరాలు

ఎట్టకేలకు పాత నేరస్థుడిని

అరెస్ట్‌ చేసిన పోలీసులు

నగరంపాలెం/గుంటూరువెస్ట్‌: కాల్‌ బాయ్‌ వ్యాపారం ముసుగులో సైబర్‌ నేరాలకు పాల్పడే ఓ పాత నేరస్థుడిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. అతని నుంచి మొబైల్‌ ఫోన్లు, సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో మంగళవారం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఆరు నెలల క్రితం ఎస్‌వీఎన్‌ కాలనీలో ఓ వృద్ధుడికి(68) ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో శైలజ మార్ని పేరుతో హాయ్‌ అని మెసేజ్‌ వచ్చిందన్నారు. వృద్ధుడు కూడా హాయ్‌ పంపించాడని చెప్పారు. కాల్‌ బాయ్‌గా చేస్తే నగదు చెల్లిస్తామని పేర్కొనడంతో వృద్ధుడు వద్దని చెప్పాడన్నారు. తర్వాత పది రోజులపాటు అవతలి వ్యక్తి వాయిస్‌ కాల్స్‌ చేసినట్లు పేర్కొన్నారు. వేరే నంబర్లతోనూ కాల్‌ చేసి పోలీసులమని, మహిళలతో అసభ్యకరంగా చాట్‌ చేస్తున్నావని వృద్ధుడికి బెదిరింపులు వచ్చాయన్నారు. కేసు నమోదైందని, మాఫీకి నగదు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులమని, రైస్‌ మిల్లులో అక్రమ లావాదేవీలు జరిగాయని, తనిఖీలకు వస్తున్నామని హెచ్చరించారు. వృద్ధుడు భయపడి పలు ఖాతాలకు సుమారు రూ.కోటి జమ చేశారని తెలిపారు. తర్వాత మోసపోయినట్లు తెలిసి పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. సీఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం సాయిబాబా గుడి బజారుకు చెందిన చోడ చైతన్యకృష్ణ పవన్‌ (27)ను నిందితుడిగా తేల్చారని పేర్కొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించామని, నేరం రుజువు కావడంతో అరెస్ట్‌ చేశామని వివరించారు.

విచారణలో విస్తుపోయే విషయాలు...

ఇంటర్‌ వరకు చదివిన చైతన్యకృష్ణ పవన్‌ బెంగళూరు కేంద్రంగా కాల్‌బాయ్‌ పేరుతో మోసగిస్తున్నాడు. నాలుగేళ్లపాటు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌ ప్రాంతాల వారిని మోసగించాడు. మహిళల పేర్లతో ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచి మెసేజ్‌ చేస్తూ పరిచయం చేసుకునేవాడు. కాల్‌బాయ్‌ కథ అల్లేవాడు. గొంతులు మార్చి కాల్‌ చేసేవాడు.

వసూళ్లే వసూళ్లు

ఒప్పుకొంటే ఏవేవో ఫీజుల కింద రూ.20 వేలు, రూ.30 వేలు తీసుకునేవాడు. తర్వాత బాధితులకు వేరే ఫోను నంబర్లతో కాల్‌ చేసి పోలీస్‌ అని బెదిరించేవాడు. ఆడవాళ్లతో అసభ్యంగా చాటింగ్‌, ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కేసు నమోదైందని బెదరగొట్టేవాడు. మళ్లీ వేరే నంబర్లతో ఫోన్‌ చేసి హైకోర్టు న్యాయవాది, సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఇలా పలు విధాలుగా చెప్పేవాడు. కేసు లేకుండా చూసేందుకని 2022లో హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని సుమారు రూ.1.70 లక్షలకు మోసగించాడు. సైబరాబాద్‌ క్రైం పీఎస్‌లో కేసు నమోదైంది. 2024 సైబరాబాద్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.20 లక్షలు కాజేశాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌ వాసి నుంచి రూ.2 లక్షలు, నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.37 వేలు జమ చేయించుకున్నాడు. కేసును ఛేదించిన పట్టాభిపురం పీఎస్‌ సీఐ జి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, పీఎస్‌ఐ ప్రదీప్‌, హెచ్‌సీ ప్రసాదరావు, ఐటీ కోర్‌ సీఐ నిస్సార్‌ బాషా, హెచ్‌సీ రాజాకిషోర్‌లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement